చిరునవ్వుల చిన్నమ్మకు వినూత్న నివాళి! మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతితో అభిమానులు శోకసంద్రంలో మునిగారు. మహిళా సాధికారత కోసం పోరాడిన ఆమె.. తన వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆ అభిమానుల్లో ఒకరు ఆమెకు వినూత్న నివాళి అర్పించారు.
ఉత్తర్ ప్రదేశ్ లఖీంపుర్ జిల్లా కొత్తబస్తీకి చెందిన అమన్ గులాటీ తనదైన శైలిలో సుష్మాస్వరాజ్‌కు నివాళులర్పించారు. ఒక్క అంగుళం పొడవున్న బాదం పప్పుపై ఆమె బొమ్మ గీసి అభిమానాన్ని చాటుకున్నారు.
యూనిక్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌తో పాటు పలు దేశాల ప్రశంసలు అందుకున్న అమన్ విదేశాలకు వెళ్లేందుకు సుష్మా చేసిన సహాయం మరవలేనన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎల్లప్పుడూ ప్రజలకు చేరువగా ఉండే సుష్మ సాయం పొందిన లక్షలాదిమందిలో తానూ ఒకడినని గులాటీ తెలిపారు.
"మాజి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజకీయ నాయకురాలైనప్పటికీ ఆమె ప్రజలతో మమేకం అయ్యి ఉండేవారు. సోషల్ మీడియా దేశంలో ప్రతి ఒక్కరితో ఆమె అందుబాటులో ఉండేవారు. అదే విధంగా, నాకూ ఆమెతో అనుబంధం ఏర్పడింది. గతేడాది కళా విభాగంలో నాకో అవార్డు వచ్చింది. అందుకు నేను కెన్యాకు వెళ్లాల్సివచ్చింది. కొన్ని కారణాల వల్ల నా పాస్‌పోర్ట్ రాలేదు. లఖ్‌నవూలోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి పలు సార్లు వెళ్లినా ప్రయోజనం లేకపోయేసరికి నేను మంత్రికి ట్వీట్ చేశాను. ఆమె వెంటనే స్పందించారు. అందుకే బాదం పప్పుపై ఇలా చిత్రీకరించి శ్రద్ధాంజలి తెలుపుతున్నాను. ఆమె లేని లోటు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. "
-అమన్ గులాటీ, కళాకారుడు.
ఇదీ చూడండి:జమ్మూ జెండాకు రాంరాం..! తుపాకీ నీడలోనే కశ్మీర్