దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ పూర్తయ్యేసరికే ప్రతిపక్షాల ఓటమి ఖరారైందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మిగతా మూడు విడతలు... వారు ఇంకెంత ఘోరంగా పరాజయం పాలవుతారో నిర్ణయిస్తాయని వ్యాఖ్యానించారు.
బిహార్ ముజఫర్‌పూర్‌లో ఎన్డీఏ ర్యాలీకి హాజరయ్యారు ప్రధాని. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిహార్‌లో ఆర్జేడీ కూటమిని గెలిపిస్తే రాష్ట్రంలో న్యాయవ్యవస్థ లేని రోజులు మళ్లీ వస్తాయని ప్రజలను హెచ్చరించారు. అవినీతికి పాల్పడి జైలుశిక్ష అనుభవిస్తున్న వారికి అధికారమివ్వొద్దని సూచించారు.
ఉగ్రవాదంపై పోరులో ఎన్డీఏ విజయం సాధించిందని పునరుద్ఘాటించారు మోదీ. ఉగ్రమూకలు చౌకీదార్‌ను చూసి భయపడుతున్నాయన్నారు.
" సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పూర్తయ్యేసరికి ప్రతిపక్షాలు నలు మూలలా ఓడాయి. రానున్న విడతల్లో నిర్ణయించాల్సింది వారు ఇంకెంత చిత్తుగా ఓడిపోతారని. ఎన్డీఏ ఎంత గొప్పగా విజయం సాధిస్తుందని. ఎలాగైనా కేంద్రంలో ఒక బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేదే వారి లక్ష్యం. జైలు శిక్ష అనుభవించిన వారు, జైలుకు వెళ్లాల్సిన వాళ్లు, బెయిల్‌పై బయట ఉన్న వారు, బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు కేంద్రంలో దృఢమైన సర్కారు అధికారంలో ఉండటాన్ని ఒక్క నిమిషం కూడా సహించలేరు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
ఇదీ చూడండి: పౌరసత్వంపై రాహుల్‌కు హోంశాఖ నోటీసులు