డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేపడితే.. రైతు పొలంలో వజ్రాలు పండినట్లే. ఒక్కసారి నాటిన చెట్లు 25 ఏళ్లపాటు కాపుకొస్తాయి. వినడానికి అతిశయోక్తిగా అనిపించినా, ఇది నిజమే. డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేపట్టి, అద్భుతమైన లాభాలు ఆర్జించిన అన్నదాతలే స్వయంగా ఈ మాట చెప్తున్నారు. మనదేశ రైతులు స్వయం సమృద్ధి సాధించేందుకు డ్రాగన్ ఫ్రూట్స్ తోటల పెంపకం ఎర్రతివాచీ పరిచింది. ఆ తోటను పెంచుతున్న రైతు మాటల్లోనే తన కథ విందాం.!
"ఒక ఎకరం పొలంలో డ్రాగన్ ఫ్రూట్స్ తోట పెంచాను. 7 లక్షల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టాను. ఒకసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఏడాది తర్వాత పంట చేతికొస్తుంది. 25 ఏళ్ల వరకూ ఈ చెట్లకు పండ్లు కాస్తాయి."
- వినయ్ గుప్తా, రైతు
ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో..
డ్రాగన్ ఫ్రూట్ మనదేశానికి చెందినది కాదు. విదేశాల పండు ఇది. సూపర్ ఫ్రూట్ అని మరో పేరు. థాయ్‌లాండ్, వియత్నాం, ఇజ్రాయెల్, శ్రీలంక సహా.. ఇతర మధ్య ఆసియా దేశాల్లో పెద్ద ఎత్తువ వీటి సాగు చేపడతారు. భారత్‌లోనూ ఇటీవలే డ్రాగన్ ఫ్రూట్స్ సాగు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో పెద్దఎత్తున ఈ తోటలు పెంచుతున్నారు.
"ఇదే డ్రాగన్ ఫ్రూట్. పూర్తిగా పండేందుకు ఏడాదిన్నర సమయం పట్టింది. చెట్లకు ఇప్పుడిప్పుడే కాయలు కాస్తున్నాయి. 7 లక్షల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టాను. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఆ చెట్ల పెంపకానికి సరిపోతాయో లేదో చూద్దామనుకున్నాం. మా నిర్ణయం సరైనదే అని ఇప్పుడు సంతోషిస్తున్నాం. చెట్లకు కాయలు కాస్తున్నాయి. మాకు తెలిసినంత వరకు ఈ చెట్లు 25 ఏళ్ల వరకూ కాపుకొస్తాయి. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాం. ఇతర ఎరువులు, రసాయనాలు వాడాల్సిన అవసరమే లేదు."
- వినోద్ కుమార్ గుప్తా, రైతు
ఖరీదూ ఎక్కువే..
గులాబీ రంగులో ఉండే డ్రాగన్ ఫ్రూట్.. చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది. రుచి కూడా మధురంగా ఉంటుంది. విదేశాల్లో ఈ పండ్లకు గిరాకీ చాలా ఎక్కువ. కిలో 300 నుంచి 400 రూపాయల వరకు అమ్ముడవుతాయి. ఆరోగ్యపరంగా మంచి లాభాలుండటంతో గిరాకీ ఎక్కువ. ఖరీదూ కాస్త ఎక్కువే. రైతులకు మంచి ధర దక్కుతుంది. ఫలితంగా ఎక్కువ మంది రైతులు డ్రాగన్ ఫ్రూట్ల సాగు వైపునకు మొగ్గు చూపుతున్నారు.
"కొన్ని పండ్లు మన దేశంలో దొరకవు. బయటినుంచి దిగుమతి అవుతాయి. ఈ పండ్లు పెద్ద పెద్ద మార్కెట్లలో సంపన్నులు కొనుగోలు చేస్తారు. అలా పెద్ద మొత్తంలో భారతీయ సంపద విదేశాలకు వెళ్తోంది. నేను చాలా పరిశోధన చేశాను. ఆ తర్వాతే డ్రాగన్ తోట పెంపకం చేపట్టాలని నిర్ణయించాను. గతేడాది ఫిబ్రవరిలో మొక్కలు తెచ్చి నాటాను. ఈ ఏడాది మే నుంచి పండ్లు కాస్తున్నాయి."