తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారీ క్లస్టర్లు ఉన్నా.. సామూహిక వ్యాప్తి లేదు' - కరోనా తాజా వార్తలు

దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 4,213 కేసులు పెరగడంపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పందించారు. కరోనా సామూహిక వ్యాప్తి దశలోకి చేరలేదని చెప్పిన ఆయన.. కొన్ని నగరాల్లో మాత్రం భారీ క్లస్టర్లను గుర్తించినట్లు తెలిపారు. కంటెయిన్‌మెంట్‌ జోన్ల ద్వారా వ్యాప్తిని నిరోధిస్తున్నామని వెల్లడించారు.

luv agarwal
'భారీ క్లస్టర్లు ఉన్నా.. దేశంలో సమూహవ్యాప్తి లేదు'

By

Published : May 11, 2020, 6:35 PM IST

కరోనా రోగి లక్షణాల ఆధారంగా డిశ్చార్జి విధానంలో మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యాక 7 రోజులు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండాలని... ఆ తర్వాత పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని భరోసా ఇచ్చారు.

" దేశంలో కొవిడ్​-19 సామూహిక వ్యాప్తికి చేరలేదు. కొన్ని నగరాల్లో మాత్రం భారీ క్లస్టర్లు ఉన్నాయి. వైరస్​ అడ్డుకట్ట వేయడంలో విఫలమైతే సంక్రమణ రేటు విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం కంటెయిన్​మెంట్​ జోన్ల ద్వారా ఆ దశకు చేరకుండా నియంత్రించగలుగుతున్నాం"

-- లవ్​ అగర్వాల్​, ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి.

4 వేల మంది స్వదేశానికి..

విదేశాల నుంచి వచ్చేవారు కేంద్ర సూచనలు కచ్చితంగా పాటించాలని కోరారు అగర్వాల్​. వందే భారత్​ మిషన్​ ద్వారా ఇప్పటి వరకు విదేశాల్లో చిక్కుకున్న 4 వేల మందిని 23 విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. 468 రైళ్లలో 5 లక్షలకు పైగా వలస కార్మికులనూ స్వరాష్ట్రాలకు చేర్చినట్లు తెలిపారు. రైళ్లలో ప్రయాణించేవాళ్లకు ఈ-టికెట్​ ఉంటే చాలని, కర్ఫ్యూ పాస్​ అవసరం లేదని స్పష్టంచేశారు అగర్వాల్.

పది కోట్ల ఫోన్లలో ఆరోగ్య సేతు

దేశవ్యాప్తంగా 9.8 కోట్ల స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్​స్టాల్​ చేసుకున్నారని ఎంపవర్డ్‌ గ్రూప్ ఛైర్మన్‌ అజయ్‌ సాహ్ని తెలిపారు. మంగళవారం నుంచి జియో ఫీచర్‌ ‌ఫోన్లలోనూ అందుబాటులో ఉంటుందన్నారు. ఆరోగ్యసేతు యాప్‌ సమాచార భద్రత, గోప్యత కోసం ఎంతో శ్రమించామని, ఎలాంటి భయాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు.

దేశంలో గత 24 గంటల్లో 4,213 కేసులు రాగా.. 1,559 మంది కోలుకున్నారు. 44,029 కేసులు యాక్టివ్​గా ఉన్నాయి. 2206 మంది మరణించారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 31.15 శాతంగా ఉంది. మొత్తం కేసులు 67,152కు చేరాయి.

ABOUT THE AUTHOR

...view details