భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలకు రంగం సిద్ధమైంది. దిల్లీ వేదికగా ఇవాళ ఈ సమావేశాలు జరగనున్నాయి. సరిహద్దులో చైనా దూకుడు సహా.. అమెరికా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇరుదేశాలకు ఈ భేటీ కీలకంగా మారింది.
సమావేశంలో భాగంగా భద్రతాపరమైన అంశాలపై భారత్ ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశం ఉంది. భారత్-అమెరికా మధ్య పరస్పర అవసరాల కోసం సమన్వయం పెంచుకోవడం.. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై దృష్టిపెట్టడం ఈ చర్చల ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు. పాంపియో, ఎస్పర్ తమ పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తోనూ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాకు చెందిన ఉపగ్రహాలు, సెన్సార్లు ప్రపంచవ్యాప్తంగా సేకరించే కీలకమైన భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్‌తో పంచుకొనేలా బేసిక్ ఎక్స్‌ఛేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంట్(బెకా)పై ఇరు దేశాలు సంతకాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.