పోలీస్ స్టేషన్ల నిర్వహణ నుంచి రైల్వే కార్యకలాపాల వరకు పలు బాధ్యతలు స్వీకరించి కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి కేరళ మహిళలు సన్నద్ధమవుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారతకు సిసలైన ఉదాహరణగా నిలవాలని తపిస్తున్నారు.
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు స్టేషన్ల బాధ్యతలను మహిళా అధికారిణులకు అప్పగించాలని కేరళ డీజీపీ లోక్నాథ్ బెహ్రా అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
"మహిళా దినోత్సవం రోజున పోలీసు స్టేషన్లను మహిళా ఎస్హెచ్ఓలు నిర్వహిస్తారు. మహిళా అధికారిణిలు లేని స్టేషన్లలో.. సీనియర్ సివిల్ పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తారు. వీరు ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులపై స్వయంగా దర్యాప్తు చేస్తారు."- లోక్నాథ్ బెహ్రా, కేరళ డీజీపీ
సీఎం ఎస్కార్ట్స్గా'
మార్చి 8న కేరళ ముఖ్యమంత్రి వాహన ఎస్కార్టులో మహిళా కమాండోలు విధులు నిర్వహిస్తారు. అలాగే ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన క్లిఫ్ హౌస్ వద్ద మహిళా కమాండోలు, సీఎం కార్యాలయం ఉన్న నార్త్ బ్లాక్లో మహిళా పోలీసు గార్డులు విధులు నిర్వహించనున్నారు.