జాతీయ భద్రతలో భారత్ ఇకపై ఏమాత్రం బలహీన దేశం కాదన్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. దేశ సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు. చైనాతో సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో రాజ్‌నాథ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
జమ్ముకశ్మీర్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ర్యాలీ నిర్వహించారు రాజ్‌నాథ్. భారతదేశ కీర్తి ప్రతిష్ఠలకు ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వదని పునరుద్ఘాటించారు.
"ఎట్టిపరిస్థితుల్లోనూ భారతదేశ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగించకుండా చూసుకుంటాం. భారత్ ఇక ఏమాత్రం బలహీనం కాదు. జాతీయ భద్రతలో మన సామర్థ్యం పెరిగింది. అయితే ఈ సామర్థ్యం ఇతరులను భయపెట్టడానికి కాదు. స్వీయ రక్షణ కోసమే."
--- రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి.
అలాగే, పొరుగు దేశాలతో వివాదాలను దాచి పెట్టేదే లేదని.. సరైన సమయంలో పార్లమెంటు ముందు అన్ని వివరాలను ఉంచుతామని స్పష్టం చేశారు. చైనాతో ఏర్పడ్డ వివాదానికి సంబంధించిన విషయాలను దేశ ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్‌నాథ్.. పై వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు చైనా సంసిద్ధత వ్యక్తం చేసిందని రాజ్‌నాథ్ తెలిపారు. దానికి భారత్ కూడా సుముఖంగానే ఉందన్నారు. సైనిక, దౌత్యపరమైన మార్గాల ద్వారా సమావేశాలు కొనసాగుతాయన్నారు.
ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దును కూడా రాజ్‌నాథ్ ప్రస్తావించారు. స్వయం ప్రతిపత్తి రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి జరుగుతోందన్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనుందని తెలిపారు. ఇక్కడి అభివృద్ధికి ముగ్ధులై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు కూడా భారత్‌లో భాగం కావాలని కోరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:-దిల్లీ కరోనా పరిస్థితులపై కేజ్రీతో 'షా' సమీక్ష