కేరళలోని శబరిమల అయప్ప స్వామి క్షేత్రానికి చేరుకోవాలంటే ఏ రైలు ఎక్కాలి? ఇలా అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే శబరిమలకు నేరుగా రైలు మార్గం లేదు. శబరిమలకు వెళ్లే భక్తులు కొట్టాయం, తిరువల్ల, చెంగనూర్ రైల్వేస్టేషన్లలో ఏదో ఒక చోట దిగి వెళ్లాల్సిందే. అక్కడ నుంచి శబరిమలకు దాదాపు 90 కిలోమీటర్ల దూరం.
దేశంలోని ప్రధాన నగరాల్ని, ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైలు మార్గాలను ఏర్పాటు చేస్తోన్న రైల్వేశాఖ.. శబరిమల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించింది. అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు?
రైల్వే మంత్రి ఆరోపణలు...
శబరిమలకు నేరుగా రైల్వే మార్గం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించడం లేదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లే శబరిమల రైలు మార్గం ప్రాజెక్ట్ వ్యయం 512 శాతం పెరిగిందన్నారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు గోయల్. ప్రతిపాదిత 111 కి మీ అంగమాలి- శబరిమల ప్రాజెక్ట్ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు.
ఎప్పుడో కావాల్సింది...
ఈ ప్రాజెక్ట్‌ను 1997-98 రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించారు. రూ.550 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్ట్ భూమికి రూ.50.76 కోట్లు సహా మొత్తం రూ.517.70 కోట్లు 2006 మే లో కేటాయించింది ప్రభుత్వం.