భారత్, పాకిస్థాన్ మధ్య ఉండే నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులు నిత్యం ఉద్రిక్తంగానే ఉంటాయి. 2013లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొన్ని వేల సార్లు ఉల్లంఘనకు గురైంది. ఇరు దేశాల మధ్య శత్రుత్వం కారణంగా అక్కడ ఎప్పుడూ యుద్ధ వాతావరణమే ఉంటుందనేది బహిరంగ సత్యం.
అయితే, వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) ఇందుకు భిన్నం. భారత్, చైనా పరస్పర అంగీకారంతో దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంది. సరిహద్దుల్లో తుపాకీ వాడకూడదని నియమంగా పెట్టుకున్నారు. గస్తీ నిర్వహించేవారు తుపాకులు వెంట తీసుకెళ్లినా, వాటి బ్యారెళ్లను కిందికి వంచుతారు. అందువల్ల చెదురుమదురు ఘటనలు మినహా హింసాత్మక ఘర్షణలు జరిగేవి కావు.
ఒప్పందాలను విస్మరించి..
కానీ, కొద్ది నెలలుగా ఇక్కడి పరిస్థితులు మారుతున్నాయి. రోజురోజుకీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గల్వాన్ లోయలో ఇరుదేశాల సైన్యం మధ్య జూన్లో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. తాజాగా భారత్, చైనా సరిహద్దులో 45 ఏళ్ల తర్వాత తొలిసారి తుపాకీ పేలింది. పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని రెజాంగ్ లా వద్ద సోమవారం జరిగిన ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఒప్పందాలకు తూట్లు పడ్డాయి.
ఇదీ చూడండి:చైనా సెల్ఫ్ గోల్- 45 ఏళ్ల తర్వాత పేలిన తూటా
ఇక్కడ మరో విషయం.. చైనా ఆర్మీ (పీఎల్ఏ) కదలికలు రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఆ సమయంలో బలగాలు, సామగ్రి రవాణా చేస్తే గుర్తించటం కష్టంగా ఉంటుందని ఓ సీనియర్ సైనికాధికారి ఈటీవీ భారత్కు వివరించారు.
"ట్రక్కులు, భారీ వాహనాలు రాత్రిపూట పాంగాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డులోని పీఎల్ఏ స్థావరాలకు చేరటం మేం గమనించాం. వ్యూహాత్మక కారణాలతోనే రాత్రివేళల్లో పీఎల్ఏ రవాణా, కదలికలను ముమ్మరం చేస్తోంది. ఘర్షణలు జరగకముందు వరకు.. ఎల్ఏసీ వెంబడి రాత్రి పూట కదలికలపై కఠిన నిషేధం ఉండేది."
- సీనియర్ సైనికాధికారి
ఎల్ఏసీ వెంబడి సుమారు లక్ష మంది బలగాలను ఇరు దేశాలు మోహరించాయి. ఆర్టిలరీ గన్స్, ట్యాంకులు, యుద్ధ విమానాలను రంగంలోకి దించాయి. వై-20 రవాణా విమానాల ద్వారా పారాట్రూపర్లు, భారీ తుపాకులు, వాహనాలను చైనా వేగంగా తరలిస్తున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.