కుష్బూ కాంగ్రెస్‌ను వీడటం తమిళనాట ఆ పార్టీకి పెద్ద దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తరఫున కీలకంగా ఉన్న ఒకప్పటి హీరోయిన్... పార్టీని వీడటానికి కారణాలుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఒకటుంది. అదేంటంటే.. సార్వత్రిక ఎన్నికల్లో కుష్బూ ఎంపీ సీటు ఆశించారు. అయితే పార్టీ అధిష్టానం ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. అలకబూనిన నాయకురాలు.. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే హస్తానికి గుడ్‌బై చెప్పి.. కమలదళంలో చేరిపోయారంటున్నారు.
కుష్బూ ఇమేజ్
రాజకీయాల్లో కుష్బూకు ఆధునిక భావాలున్న నాయకురాలిగా పేరుంది. మరోవైపు తమిళనాడులో భాజపాపై సంప్రదాయ పార్టీగా ముద్రపడింది. ఈ నేపథ్యంలోనే కుష్బూ ఇమేజ్ పార్టీకి పనికొస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. కాషాయ కండువా కప్పుకున్న అనంతరం చెన్నైకు చేరిన కుష్బూకు భాజపా శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. గతంలో చేరిన నమిత, గౌతమికి ఇంత ప్రాధాన్యం దక్కలేదు. కుష్బూకు తమిళ ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉండటం, రానున్న ఎన్నికల్లో కుష్బూను పార్టీ ముందుంచాలని భావించటమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌తో ఆరేళ్ల సావాసం
కుష్బూ కాంగ్రెస్‌లో ఉన్నపుడు అధికార ప్రతినిధిగా ఆరేళ్లు కొనసాగారు. కాంగ్రెస్ ఆమెకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యమిచ్చింది. అయితే, కోరినట్లుగా ఎంపీ స్థానం మాత్రం కేటాయించలేదు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి నుంచే కుష్బూ కాంగ్రెస్‌ను వీడతారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇదీ చూడండి: కుష్బూ బర్త్‌డే: వెండితెర నుంచి రాజకీయాల వరకు!
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కుష్బూ అసంతృప్తిని భాజపా సొమ్ము చేసుకుంది. తమిళనాడు భాజపా అధ్యక్షుడు మురుగన్ కుష్బూ పార్టీలో చేరటంలో కీలక పాత్ర పోషించారు.
మురుగన్ ప్రయత్నం
గత నెలలోనే మురుగన్ ఆమెతో సమావేశమయ్యారు. అయితే, వెంటనే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ అళగిరి.. బుజ్జిగింపు చర్యల్లో భాగంగా పలుమార్లు కుష్బూను కలిశారు. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా పెరంబూర్‌లో జరిగిన ధర్నాలో భాజపాపై విమర్శలు సైతం చేశారు. ఈ సంఘటనల అనంతరం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని అంతా భావించారు.