తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాదవ్​ మరణశిక్షపై పున:సమీక్షించాల్సిందే: ఐసీజే - ICJ

కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో భారత్​కు అనుకూలంగా తీర్పును వెలువరించింది అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే). ఈ కేసును పునఃసమీక్షించే వరకూ మరణ శిక్ష నిలిపివేయాలని ఆదేశించింది. న్యాయవాదిని కలిసేందుకు కుల్​భూషణ్​కు అనుమతివ్వాలని స్పష్టం చేసింది అంతర్జాతీయ న్యాయస్థానం.

కుల్​భూషణ్​ మరణ శిక్ష నిలిపేసిన ఐసీజే

By

Published : Jul 17, 2019, 7:41 PM IST

Updated : Jul 17, 2019, 9:14 PM IST

హేగ్​లో భారత్ గొప్ప విజయం

అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో భారత్​ గొప్ప విజయం సాధించింది. రహస్య గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్​ చెరలో ఉన్న భారత నావికాదళ విశ్రాంత అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో భారత్​కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కుల్​భూషణ్​కు పాక్ మిలిటరీ కోర్టు విధించిన మరణ శిక్షను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఐసీజే. ఈకేసును పునఃసమీక్ష చేయాలని స్పష్టం చేసింది. న్యాయవాదిని నియమించుకునే సౌకర్యం కుల్​భూషణ్​కు కల్పించాలని పాక్​కు సూచించింది ఐసీజే.

తీర్పు సందర్భంగా పాక్‌ తీరును న్యాయస్ధానం తీవ్రంగా తప్పుపట్టింది. జాదవ్‌తో మాట్లాడడం సహా అతన్ని కలుసుకునేందుకు భారత్‌కు ఉన్న హక్కులను హరించడం ద్వారా పాక్‌..... వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ అరెస్టు విషయంపై భారత్‌కు పాక్‌ సమాచారం ఇవ్వలేదని మండిపడింది.

భారత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరిస్తూ ఐసీజే తీసుకున్న నిర్ణయంపై పాక్‌ అభ్యంతరాలను న్యాయస్ధానం తోసిపుచ్చింది. భారత్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించవచ్చని స్పష్టం చేసింది. జాదవ్‌ భారత పౌరుడు కాదని సందేహించడానికి ఎలాంటి ఆస్కారం లేదని న్యాయస్ధానం తెలిపింది. 16 మంది న్యాయమూర్తుల్లో చైనా న్యాయమూర్తి సహా భారత్‌కు అనుకూలంగా 15 మంది రూలింగ్‌ ఇచ్చారు. భారత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఐసీజే ఈ ఏడాది ఫిబ్రవరి 21న విచారణను పూర్తి చేసింది.

Last Updated : Jul 17, 2019, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details