కర్ణాటకీయం: కుమారస్వామి రాజీనామా చేయక తప్పదా? కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు.. కుమారస్వామి మంతనాలు... భాజపా ఎత్తుగడలు... ఎమ్మెల్యేల రాజీనామాలు... ఇలా రోజుకో మలుపు తిరుగుతోంది కన్నడ రాజకీయం. ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సతమతమవుతోన్న కుమారస్వామి సర్కారుకు బుధవారం.. మరో ఇద్దరు శాసనసభ్యులు షాక్ ఇచ్చారు.
కాంగ్రెస్ నేతలు ఎమ్‌టీబీ నాగరాజు, సుధాకర్ స్పీకర్ రమేశ్ కుమార్‌కు తమ రాజీనామా లేఖలు పంపారు. ఈ మేరకు సభాపతి ధ్రువీకరించారు.
విధానసౌధలో రాజీనామా చేసి బయటకు వచ్చిన శాసనసభ్యుడు సుధాకర్‌పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. రాజీనామా సమర్పించి బయటకు వచ్చిన అనంతరం విధానసౌధలోని మూడో అంతస్తులో సభాపతి కార్యాలయం ఎదుట సుధాకర్‌తో ఘర్షణకు దిగారు కాంగ్రెస్ నేతలు. బెంగళూరు పోలీస్ కమిషనర్ విధానసౌద ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు.
సుధాకర్‌పై దాడిని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఖండించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం లేదనడానికి ఈ దాడే ఉదాహరణ అని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రోజురోజుకూ ఎమ్మెల్యేల రాజీనామాల సంఖ్య పెరుగుతుండటం సీఎం కుమారస్వామికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చలు జరపడానికి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ముంబయి వెళ్లగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. చివరకు ఆయన బెంగళూరుకు వెనుదిరిగాల్సి వచ్చింది.
ప్రస్తుతం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరింది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఇదే బాటలో సాగుతారనే వార్తల నేపథ్యంలో కుమారస్వామి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్కారు పతనం కాకముందే... తప్పుకోవడం మంచిదని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.