కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఫిబ్రవరి 6న మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం 13 మందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో కాంగ్రెస్, జేడీఎస్‌లను వదిలి భాజపా తరఫున గెలిచిన 10 మందికి మంత్రులుగా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అదనపు ఉపముఖ్యమంత్రులు అంటూ ఎవరూ ఉండరని స్పష్టం చేశారు.
"ఫిబ్రవరి 6న రాజ్‌భవన్‌లో ఉదయం 10.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు."- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి
అధిష్ఠానం అనుమతితో..
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోని 17 మంది శాసనసభ్యులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, భాజపాకు మద్దతుగా నిలిచారు. ఫలితంగా వారిపై అనర్హత వేటు పడడం.. ఉపఎన్నికలకు దారితీయడం జరిగింది.
2019 డిసెంబర్ 5న జరిగిన కర్ణాటక ఉపఎన్నికల్లో మొత్తం 15 స్థానాలకు గాను భాజపా 12 స్థానాల్లో విజయం సాధించింది. ఫలితంగా కర్ణాటకలో భాజపా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవకాశం ఏర్పడింది.
ఈ సందర్భంగా ఇతర పార్టీల నుంచి వచ్చి భాజపాలో చేరి తిరిగి ఎన్నికైన 11 మందిని మంత్రులుగా చేస్తామని యడియూరప్ప మాటిచ్చారు. ఈ నేపథ్యంలో తన మంత్రివర్గాన్ని విస్తరించేందుకు భాజపా అధిష్ఠానం నుంచి జనవరి 31న ఆమోదం పొందారు. మిగిలిన ఆరుగురు సభ్యులకు కూడా తాను ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తానని స్పష్టం చేశారు.
ఎలాగైనా అవకాశం కల్పిస్తాం!
అనర్హతకు గురై, ఉపఎన్నికల్లో భాజపా టికెట్ లభించని రాణే బెన్నూర్ మాజీ ఎమ్మెల్యే ఈ శంకర్‌ను ముందు ఎమ్మెల్సీగా చేసి, తరువాత మంత్రిని చేస్తామని యడియూరప్ప స్పష్టం చేశారు.
భాజపాలో చేరి హునాసూరు, హోస్కోట్ ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏహెచ్ విశ్వనాథ్, ఎంటీబీ నాగరాజ్లకు... సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మంత్రి పదవులు కేటాయించడం కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.