'పౌర' సెగ: కేరళ హర్తాళ్ హింసాత్మకం పౌరసత్వ చట్టంపై వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, బంగాల్, దిల్లీని తాకిన పౌర సెగ కేరళలోనూ ఉద్రిక్తతలకు దారి తీసింది. 30 ఇస్లామిక్ సంఘాలు, పలు రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేటి హర్తాళ్ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. రాష్ట్రంలో పలుచోట్ల కేఎస్ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు... బలవంతంగా దుకాణాలను మూయించారు.
నిన్న ఉమ్మడిగా నిరసన వ్యక్తం చేసిన అధికార సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, ప్రతిపక్ష కాంగ్రెస్-యూడీఎఫ్ పార్టీలు నేటి హర్తాళ్‌కు దూరంగా ఉన్నాయి.
తీవ్ర ఉద్రిక్తత...
హర్తాళ్‌ను నియంత్రించేందుకు పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా 200 మందిని అరెస్ట్ చేయడంపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తిరువనంతపురంలో బస్సులపై రాళ్లు రువ్వగా.. ఒక ప్రయాణికుడికి గాయాలయ్యాయి. ఆందోళనకారులు సచివాలయం సమీపంలోని ఏజీ కార్యాలయం వైపునకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు పలుమార్లు జలఫిరంగులను ప్రయోగించారు. అయినప్పటికీ నిరసనకారులు బారికేడ్లను దూకే ప్రయత్నం చేశారు.
పలుమార్లు పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ... కొంతమంది మహిళలు రోడ్డుపై కూర్చొన్ని పౌరసత్వ చట్టానికి, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తిరువనంతపురంతో పాటు కొల్లాం, పాలక్కాడ్, ఎర్నాకులం, వయనాడ్, కోజికోడ్, కన్నూర్ జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటాయి. నేడు జరగాల్సిన పలు పాఠశాల, విశ్వవిద్యాలయ పరీక్షలు వాయిదా పడ్డాయి.