కోజికోడ్ విమాన ప్రమాద ఘటనతో కేంద్ర విమానయాన యంత్రాంగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అప్రమత్తమైంది. అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఏటా భారీ వర్షాలతో సతమతమవుతున్న ముంబయి, చెన్నై వంటి విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఏఏఐ కింద 100కు పైగా..
పౌర విమానయాన శాఖ కింద పనిచేసే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ).. దేశవ్యాప్తంగా మొత్తం 100కుపైగా విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ఇందులో కోజికోడ్ ఎయిర్పోర్ట్ ఒకటి. అయితే.. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాలు మాత్రం ప్రైవేటు కంపెనీల అధ్వర్యంలో నడుస్తున్నాయి.
'ఈఎంఏఎస్ టెక్నాలజీ లేకనే..'
కోజికోడ్‌లోని టేబుల్‌టాప్ రన్‌వేలో.. భద్రత కల్పించేందుకు ఇంజనీర్డ్ మెటీరియల్ అర్రెస్టర్ సిస్టమ్(ఈఎంఏఎస్) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ప్రమాదం అనంతరం కాంగ్రెస్ ఎంపీ మాణిక్కమ్ ఠాగూర్ తెలిపారు. ఈ విషయాన్ని ఏఏఐ, డీజీసీఏలు విస్మరించాయని ఆయన ఆరోపించారు.
ఈఎంఏఎస్ ద్వారా విమానాశ్రయం చుట్టూ ప్రత్యేక సామాగ్రితో కట్టుదిట్టమైన భద్రతను అమరుస్తారు. ఫలితంగా ఫ్లైట్ ల్యాండింగ్‌కు రన్వేఅనుగుణంగా ఉంటుంది.
అయితే.. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా కోజికోడ్ విమానాశ్రయంలో రన్‌వే ఎండ్ సేఫ్టీ ఏరియా(ఆర్ఈఎస్ఏ) అమర్చామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ పేర్కొన్నారు. ఐసీఏఓ ప్రకారం.. సివిల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈఎంఏఎస్ తప్పనిసరికాదని ఆయన స్పష్టం చేశారు. ఆర్ఈఎస్ అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఈఎంఏఎస్ అవసరమవుతుందని తెలిపారు.
ఇదీ చదవండి:'కోజికోడ్ విమానాశ్రయ రన్‌వే సురక్షితమైనదే'