తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొత్త కోటలపై కాషాయ జెండా రెపరెపలు' - ఖర్గే

2014 లోక్​సభ ఎన్నికల్లో భాజపా సాధించిన సీట్లు 282. 2019 సార్వత్రిక సమరం తర్వాత ఆ సంఖ్య 300కు చేరుతుందని ధీమా వ్యక్తంచేశారు యడ్యూరప్ప. కర్ణాటకలో కాంగ్రెస్​-జేడీఎస్​ సర్కారు కూలిపోతుందని జోస్యంచెప్పారు.

'కొత్త కోటలపై కాషాయ జెండా రెపరెపలు'

By

Published : Mar 25, 2019, 1:48 PM IST

భాజపాకు ఇప్పటివరకు పెద్దగా ప్రాబల్యంలేని రాష్ట్రాల్లోనూ.... లోక్​సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్​ యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తంచేశారు.

రాజకీయ పరిస్థితులు, భాజపా వ్యూహాలు, తదితర అంశాలపై తన అభిప్రాయాలను పీటీఐ వార్త సంస్థతో పంచుకున్నారు.

మోదీ ప్రభావం పెరిగింది

దేశంలో మోదీ పట్ల సానుకూలత ఉందని, గత ఎన్నికల కంటే ఈసారి నరేంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషించారు యడ్యూరప్ప.

"బంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని సీట్లు గెలుచుకుంటామని భావిస్తున్నాం. దీనితో భాజపా 300 సీట్ల మార్కుకు చేరుకుంటుంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గతం కంటే మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాం. కేరళలో ఖాతా తెరుస్తాం"
--యడ్యూరప్ప, కర్ణాటక భాజపా అధ్యక్షుడు

రాహుల్‌కు అమేఠీలో ఓటమే!

రాహుల్‌ గాంధీ కర్ణాటకలో పోటీ చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు దినేష్‌ గుండూరావు ఇటీవలే లేఖ రాశారు. దీనిపై వ్యంగ్యస్త్రాలు సంధించారు యడ్యూరప్ప.

"నా అభిప్రాయం ప్రకారం అమేఠీలో స్మతి ఇరానీపై రాహుల్‌ గాంధీ ఓడిపోనున్నారు. అందుకే కర్ణాటక నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇక్కడ గెలవటం అంత సులువు కాదు. రాహుల్‌ గాంధీ అంత సాహసం చేయకపోవచ్చు."
--యడ్యూరప్ప, కర్ణాటక భాజపా అధ్యక్షుడు

కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోతుంది...

కర్ణాటకలో 20-22 సీట్లు భాజపా గెలిస్తే... జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమిలో అంతర్గత కలహాల వల్ల ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు యడ్యూరప్ప.

"హైదరాబాద్‌- కర్ణాటక ప్రాంతంలో పార్టీకి ఆదరణ ఉంది. ముంబయి-కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతంలో ఇప్పటికే మంచి పట్టు ఉంది. తుముకూరు, మైసూరు, రామ్‌గంగా, హసన్‌ లాంటి జేడీఎస్‌ ప్రాబల్య ప్రాంతాల్లో పార్టీ బలం పెరుగుతోంది. కర్ణాటకలో భాజపా మంచి స్థితిలో ఉంది."
--యడ్యూరప్ప, కర్ణాటక భాజపా అధ్యక్షుడు

ఖర్గేకు గడ్డు పరిస్థితులు..

మల్లిఖార్జున ఖర్గేకు మద్దతుదారులైన కొందరు నేతలు భాజపాలో చేరటం వల్ల హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతంలో ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారని విశ్లేషించారు యడ్యూరప్ప.

"ఇక్కడ ఇప్పటికే మంచి స్థాయిలో ఉన్న పార్టీ ఈ నేతల చేరికతో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కోబోతుంది. మంబయి-కర్ణాటక, మధ్య కర్ణాటకలో ఎప్పటిలానే పార్టీ బలంగా ఉంది. కర్ణాటకలో నాలుగు ర్యాలీల్లో ప్రసంగించాలని మోదీని కోరాం. తేదీలు, ప్రాంతాలను ఇంకా నిర్ణయించలేదు"
--యడ్యూరప్ప, కర్ణాటక భాజపా అధ్యక్షుడు

2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాల్లో భాజపా 17 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌ 9, జేడీఎస్‌ 2 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఈసారి కాంగ్రెస్‌ 20 సీట్లలో పోటీ చేస్తుండగా... జేడీఎస్ 8 సీట్లలో బరిలో ఉంది.

ABOUT THE AUTHOR

...view details