తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లికి అన్నీ తానై - కడుపు నింపేందుకు చిన్నారి కష్టాలు

ఆటలాడుకొని వచ్చి  తల్లి ఒడిలో సేదతీరాల్సిన వయసులో బరువైన బాధ్యతలను భుజానికెత్తుకుంది ఆ చిన్నారి. నా అన్న వారి ఆదరణకు నోచుకోక... తల్లి అనారోగ్యం, వేసవి సెగల్లో ఆకలి బాధకు తాళలేక ఆ చిన్నారి చేస్తున్న పని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది.

తల్లికి అన్నీ తానై - కడుపు నింపేందుకు చిన్నారి కష్టాలు

By

Published : May 28, 2019, 10:28 PM IST

తల్లికి అన్నీ తానై - కడుపు నింపేందుకు చిన్నారి కష్టాలు

రామాయణం చదివారా! అందులో శ్రవణకుమారుడి కథ గుర్తుందా! అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోస్తూ సేవలు చేస్తుంటాడు. చిన్నవయసులోనే వారి అవసరాలు తీర్చేందుకు పని చేస్తుంటాడు. కర్ణాటకలోని కొప్పల్​లోనూ ఉంది ఓ శ్రవణ కుమారి. భిక్షాటన చేస్తూ అనారోగ్యంతో ఉన్న తల్లి బాగోగులు చూస్తోంది.

ఆ చిన్నారి పేరు భాగ్యశ్రీ. పేరులో ఉన్న భాగ్యం నుదుటి గీతల్లో లేనట్టుంది. చిన్న వయస్సులోనే పెద్ద కష్టం వచ్చి పడింది. భాగ్యశ్రీ తల్లి దుర్గమ్మ బోవి... అనారోగ్యంతో ఆస్పత్రి పాలైంది. రెండో వివాహం చేసుకున్న చిన్నారి తండ్రి అర్జున్ ఆమెను ఆస్పత్రిలో చేర్చి ముఖం చాటేశాడు. తల్లికి భోజనం పెట్టేందుకు ఆస్పత్రిలోని వారు, సందర్శకుల వద్ద భిక్షాటన చేస్తోంది ఆ చిన్నారి.

మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. మా నాన్న ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయారు. మళ్లీ రాలేదు. నేను ఇక్కడ ఉండి మా అమ్మకు భోజనం తీసుకుని వస్తాను. ఎవరైనా డబ్బులిస్తే ఆ సొమ్ముతో మా అమ్మకు భోజనం పెడతాను. మా వాళ్లకు ఫోన్ చేశా. తీసుకెళ్లేందుకు వస్తామని చెప్పారు. కానీ ఇంకా రాలేదు.

-భాగ్యశ్రీ, చిన్నారి

కడుపు తరుక్కుపోయే దుస్థితిలో ఉన్న వీరిది కొప్పల్ జిల్లాలోని కరతాగి తాలుకా సిద్ధపుర. భర్త మరో మహిళను వివాహమాడగా తట్టుకోలేక దుర్గమ్మ బోవి మద్యానికి బానిసైంది. ఈ కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది.

తల నొప్పి విపరీతంగా వస్తుంది. కింద పడిపోతుంటాను. నా అనారోగ్యంపై డాక్టర్లు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. నా కూతురే నా బాగోగులు చూస్తుంది. నాకు అన్నం పెడుతోంది.

-దుర్గమ్మ బోవి

భిక్షాటన అంటే ఏంటో కూడా తెలియకూడని వయసులో ఆ పని చేస్తున్న భాగ్యశ్రీ పరిస్థితి పలువురిని కంటతడి పెట్టిస్తోంది. చిన్న వయస్సులో పెద్ద కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మేం ఆస్పత్రిలో చేరకముందు నుంచే ఆ తల్లి కూతుళ్లున్నారు. వారి బంధువులు ఎవరూ రావడం లేదు. ఆ చిన్న పాపే ఆస్పత్రికి వచ్చే వారి వద్ద భిక్షాటన చేస్తోంది. తినడానికి ఏదన్నా ఇస్తే తాను తినకుండా తల్లి వద్దకు తీసుకెళుతుంది.

- ఆస్పత్రిలోని ఓ మహిళ

ఎంపీ ఆర్థిక సాయం

వీరి దుస్థితిని తెలుసుకున్నారు నూతనంగా ఎన్నికైన కొప్పల్ ఎంపీ సంగన్న కరడీ. రూ.10వేల ఆర్థిక సహాయాన్నందించారు. చిన్నారి చదువుకునేందుకు సహాయం చేస్తానని ప్రకటించారు. తల్లి కోలుకునే వరకు బాగోగులు చూసుకోవాల్సిందిగా ఆస్పత్రి వర్గాలను ఆదేశించారు.

ఇదీ చూడండి : జనాభా నియంత్రణ వ్యాజ్యం విచారణకు హైకోర్టు ఓకే

ABOUT THE AUTHOR

...view details