'ఆటో డ్రైవర్, తాపీ మేస్త్రీలే.. మా లెక్కల మాస్టార్లు!' కేరళ కొల్లంలోని మైలక్కడు యూపీ పాఠశాలలో ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఇక్కడ ఓ ఆటో డ్రైవరు... పిల్లలను పాఠశాలకు తీసుకురావడమే కాదు.. వారికి పాఠాలూ చెబుతున్నాడు. గోడలు నిర్మించే తాపీ మేస్త్రీ బడి పంతులు అవతారమెత్తి విద్యార్థుల భవితను నిర్మిస్తున్నాడు.
విద్యా విధానాన్నే మార్చేసింది
కేరళ రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా మండలి వారి చొరవతో విద్యార్థులకు గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తోందీ పాఠశాల. వాస్తవికాంశాలను అందించి ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠాలు నేర్పించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇందుకోసం రాధాకృష్ట పిళ్లై అనే ఆటోడ్రైవర్, మోహనన్ అనే తాపీ మేస్త్రీల సాయం తీసుకుందీ పాఠశాల. వీరిద్దరూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో లెక్కలు నేర్పించారు. ఇటుకల సాయంతో కొలతలు, వైశాల్యం, చుట్టుకొలత, దూరం.. వంటి లెక్కలను సులభంగా బోధించాడు ఈ మేస్త్రీ మాస్టారు. పరిమాణ బరువులు, మీటర్ ఛార్జీల నిర్ధరణ, చక్రాల వ్యాసం, ఇంజిన్ నిర్మాణం గురించి డ్రైవర్ మాస్టారు వివరించారు.
లెక్కలను భారంగా భావించే విద్యార్థులు ఇప్పుడు ఆచరణాత్మకంగా నేర్చుకున్నాక గణితంలో ఉండే లాజిక్కుతో పాటు కిక్కునూ ఆస్వాదిస్తున్నారు. ఎన్నడూ బడి గడప తొక్కని కార్మికులు ఇలా పిల్లలతో సమయం గడపడం ఆనందంగా ఉందంటున్నారు.
ఇదీ చూడండి:శబ్దాలు చేసేవి కావు.. ఇవి నోరూరించే టపాకాయలు!