తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: హిట్ పెయిర్​ మెగా షోకు గ్రౌండ్ రెడీ

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అతి త్వరలో గుర్తింపు పొందనుంది అహ్మదాబాద్‌లోని మోటేరా స్టేడియం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనలో భాగంగా ఈ స్టేడియంలోనే సోమవారం 'నమస్తే ట్రంప్​' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. లక్షా 10 వేల మంది కూర్చుని మ్యాచ్‌ను తిలకించేలా నిర్మించిన ఈ స్టేడియం ఎంసీసీ మైదానాన్ని తోసిరాజని అతిపెద్ద స్టేడియంగా అవతరించనుంది. ఈ సందర్భంగా స్టేడియం విశేషాలు మీకోసం...

motera-stadium
ట్రంప్-మోదీ ప్రారంభించే మోటేరా స్టేడియం విశేషాలివే...

By

Published : Feb 23, 2020, 8:29 PM IST

Updated : Mar 2, 2020, 8:06 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం విశేషాలివే...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో నిర్మించిన భారీ క్రికెట్‌ స్టేడియంలోనే సోమవారం 'నమస్తే ట్రంప్​' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారీ రోడ్​ షో అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ట్రంప్​ పాల్గొంటారు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మోటేరా మైదానం రికార్డుల్లోకెక్కనుంది. ఇప్పటివరకు... ప్రపంచంలోని అతిపెద్దదైన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం రెండో స్థానానికి పడిపోనుంది. మెల్‌బోర్న్‌ స్టేడియం సామర్థ్యం లక్ష కాగా... లక్షా పది వేల సామర్థ్యంతో మోటేరా స్టేడియాన్ని నిర్మించారు. ఈ స్టేడియాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షించనుంది.

దిగ్గజాల రికార్డులు..

  1. మోటేరాలో గతంలో సర్దార్‌ వల్లభ్‌భాయ్ పటేల్ పేరిట క్రికెట్ స్టేడియం
  2. 1982లో స్టేడియం నిర్మాణం- 53 వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించే వీలు
  3. 1983లో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌కు వేదిక
  4. మాజీ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ టెస్టు‌ క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నది ఇక్కడే.
  5. ఇదే స్టేడియంలో టెస్టుల్లో తొలి ద్విశతకాన్ని నమోదు చేసిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌.

2017లో నూతన మైదానం పనులు..

2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఆ తర్వాత విస్తరణ పనుల్లో భాగంగా 2015లో పాత మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. 2017 జనవరిలో ప్రారంభమైన పనులు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తయ్యాయి. ఎంసీసీని డిజైన్‌ చేసిన ఎంఎస్​ పాపులస్‌ అనే ఆర్కిటెక్ట్‌ సంస్థే మోటేరా స్టేడియానికి కూడా రూపకల్పన చేసింది. ఎల్‌అండ్‌టీ సంస్థ మూడేళ్లలో ర్మాణం పూర్తి చేసింది. 800 కోట్లు ఖర్చుకాగా ప్రపంచంలోనే అత్యధిక ఖర్చుతో నిర్మించిన క్రికెట్‌ స్టేడియంగా మోటేరా గుర్తింపు సంపాదించింది.

11 పిచ్​లు..

ఈ మైదానంలో మొత్తం 11 పిచ్‌లను తయారు చేయడం విశేషం. అందులో కొన్ని ఎర్ర మట్టితో, ఇంకొన్ని నల్లమట్టితో మరికొన్ని రెండింటి మిశ్రమంతో తయారు చేశారు. పేసర్లు, స్పిన్నర్లకు సమానంగా సహకరించేలా పిచ్‌లను తీర్చిదిద్దినట్లు స్టేడియం వర్గాలు చెబుతున్నాయి. ఆటగాళ్ల సాధన కోసం ఇండోర్‌ నెట్స్‌, 6 పిచ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంత వర్షం పడ్డా 30 నిమిషాల్లో మైదానం నుంచి నీరంతా బయటకు వెళ్లిపోయి మ్యాచ్‌ మొదలుపెట్టడానికి అనువుగా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

360 డిగ్రీల వ్యూ..

స్టేడియంలో ఏ మూల కూర్చున్నా మ్యాచ్‌ చూడ్డానికి ఇబ్బందులు లేకుండా, ఏదీ అడ్డుపడకుండా.. 360 డిగ్రీల వ్యూతో స్టేడియాన్ని డిజైన్‌ చేశారు.

అల్ట్రా మోడరన్ లైట్, సౌండ్ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఫ్లడ్‌లైట్ల స్థానంలో తొలిసారిగా ఎల్‌ఈడీ లైట్లను వినియోగించారు. 90 మీటర్ల ఎత్తైన టవర్‌పై ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. క్రీడాకారులు గాయపడితే ఫిజియో థెరపీతోపాటు హైడ్రో థెరపీ చికిత్స అందించే సౌకర్యం ఉంది. పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌ నుంచి నేరుగా స్టేడియం ఫస్ట్‌ ఫ్లోర్‌కు చేరుకోవచ్చు.

76 కార్పొరేట్​ బాక్సులు..

ఈ స్టేడియంలో మొత్తం 76 కార్పొరేట్‌ బాక్సులున్నాయి. క్రీడాకారులు, అంపైర్లు, మీడియా కోసం.. ప్రత్యేక బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ఆటగాళ్ల కోసం నాలుగు డ్రెస్సింగ్‌ రూమ్‌లు నిర్మించారు. ప్రతి స్టాండ్‌ వద్ద ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశారు. వీటితోపాటు విలాసవంతమైన క్లబ్‌ హౌస్ ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ హౌస్‌లో 55 గదులుండగా ఇండోర్, అవుట్‌ డోర్ ఆటలు ఆడేందుకు సైతం ఏర్పాట్లు చేశారు. రెస్టారెంట్, ఒలింపిక్‌ సైజు స్విమ్మింగ్ పూల్‌ను సైతం నిర్మించారు. ఈ క్లబ్ మెంబర్‌షిప్ ఖరీదు రూ.7 లక్షలు.

63 ఎకరాల్లో..

మొత్తం 63 ఎకరాల పరిధిలో స్టేడియం, ఇతర నిర్మాణాలు విస్తరించి ఉన్నాయి.

క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, హాకీ ,ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్‌ బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడేలా స్టేడియాన్ని నిర్మించారు. క్రికెట్ ఔత్సాహికుల కోసం క్రికెట్ అకాడమీ ఏర్పాటుకై స్థలం కేటాయించారు. 3 వేల కార్లు, 10 వేల ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్‌ ఏర్పాట్లు ఉన్నాయి.

మార్చిలో తొలి మ్యాచ్​..

మార్చిలో ఆసియా ఎలెవన్‌, ప్రపంచ ఎలెవన్‌ మధ్య ఎగ్జిబిషన్‌ క్రికెట్‌ మ్యాచ్‌తో మోటేరా స్టేడియం అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ క్షణం వస్తుందా అని సగటు క్రీడా అభిమానులు వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి:20 అడుగుల 'నమస్తే ట్రంప్​' త్రీడీ రంగోలి

Last Updated : Mar 2, 2020, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details