పౌరసత్వ సవరణ చట్టంలో భారతీయులకు వ్యతిరేకంగా ఒక్క అక్షరమున్నా ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులు తట్టుకోలేక దశాబ్దాల క్రితం మన దేశానికి తప్పించుకొని వచ్చి మురికివాడల్లో జీవచ్ఛవాల్లా గడుపుతున్న వారికి పౌరసత్వం కల్పించాలన్నదే ఈ చట్టం లక్ష్యమని వివరణ ఇచ్చారు. ‘‘ఇంటి నుంచి గడపదాటే ముందు ఎందుకోసం మీరు బయటికెళ్తున్నారు? ఎవరి కోసం నినాదాలిస్తున్నారు? ఆందోళనల్లో ఎందుకు పాల్గొంటున్నారు? పోలీసులపై రాళ్లెందుకు వేస్తున్నారు? వాహనాలను ఎందుకు తగులబెడుతున్నారు? అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి’’ అని ఆందోళనకారులకు హితవు చెప్పారు. దేశ వ్యాప్తంగా చేపట్టే జాతీయ పౌర పట్టికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే ఒక్క భారతదేశంలో తప్ప అన్ని దేశాల్లోనూ ఇలాంటి పట్టికలు ఉన్నాయని అన్నారు. అయితే తమ పౌరసత్వం నిరూపణకు భారతీయులు ఎవరూ ఎలాంటి పత్రాలూ చూపాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టంపై ఎవరికీ ఎలాంటి భయమూ అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కేవలం మానవతా దృక్పథంతోనే శరణార్థులను దేశ పౌరులుగా గుర్తిస్తున్నామని, అంతకుమించి మరో కారణం లేదని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతోనే కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటి మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణం నెలకొన్న తరువాత శరణార్థుల గుర్తింపు, పౌరసత్వం మంజూరుపై విధివిధానాలు ఖరారవుతాయని చెప్పారు.
* ఈ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఇంతగా స్పందించడానికి కారణం ఏమిటి?
మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిన్న సంఘటనను కూడా చిలవలు పలవులుగా చేసి దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు ఎంతో మంది ప్రయత్నించారు. ఇదివరకు అసహనం పేరుతో అవార్డులను వాపస్ చేసే ఉద్యమాన్ని ఆరునెలల పాటు చేపట్టారు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే రక్షణ లేదు.. వెంటనే తీసేసుకోండని ప్రజల్లో భయాందోళనలు సృష్టించారు. ఇళ్లలోని బంగారానికీ లెక్క చెప్పాల్సిందేనని ప్రచారం చేశారు. ఇప్పటివరకూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన శక్తులే ఇప్పుడు సున్నితమైన అంశంపై మత పరంగా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు పాకులాడుతున్నాయి. దురదృష్టవశాత్తు పౌరసత్వ సవరణ చట్టంతో పెద్దగా సంబంధంలేని దిల్లీ, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు మిగిలిన ప్రాంతాల్లో అనవసరంగా విషపూరితమైన తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇది ముస్లిం వ్యతిరేక బిల్లు అని ప్రజల మనసుల్లో బీజాలు నాటి రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష మేధావి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఈ దేశంలోని ఏ మతం, ప్రాంతం, కులం, వర్గంవారికీ ఇబ్బంది ఉండదు.
* మీరు ఎంత భరోసా కల్పిస్తున్నా కొన్ని వర్గాలు నమ్మడం లేదు. పలువురు ఆందోళనకు గురవుతున్నారు కదా?
ప్రచార, ప్రసార సాధనాలు ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఈ చట్టంలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పౌరసత్వ సవరణ చట్టంలో ఎవరికి వ్యతిరేకంగా అయిన ఒక్క అక్షరమున్నా ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పాకిస్థాన్‌లో ఎన్నో ఏళ్లుగా లక్షల మంది మత వివక్షకు గురయ్యారు. అక్కడి మెజార్టీ ప్రజల వేధింపులకు తట్టుకోలేక మతమార్పిడులు చేసుకొని వివాహాలు చేసుకున్నారు. ఎంతోమంది హత్యకు గురయ్యారు. చివరకు ఏ దారీలేనివారు బతుకుజీవుడా అంటూ 30-40 ఏళ్ల క్రితం భారతదేశంలోకి వచ్చి మురికివాడల్లో దుర్భర జీవితం గడుపుతున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా జీవచ్ఛవాలుగా బతుకుతున్న వారికి పౌరసత్వం ఇవ్వాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ పనిని మోదీ చేస్తే వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పుడు ఒక దేశంగా ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన బాధితులకు ఇప్పుడు భారతదేశం రావడం మినహా మరో గత్యంతరం లేదు. మానవతా దృక్పథంతో వారికి పౌరసత్వం ఇస్తున్నారు తప్పితే, దేశంలోని వారికి పౌరసత్వం తొలగించే ప్రస్తావనే ఈ చట్టంలో లేదు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలను చంపేశారనో... ఇంకోటనో అబద్ధాలు వ్యాప్తం చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే ఆందోళనలను కాకుండా హింసను మాత్రమే అడ్డుకుంటున్నాం.
* పౌరసత్వం నిరూపించుకోవడం తలకు మించిన పని అవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా? దీనికి ఏం చెబుతారు?