జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభానికి ముందు కీలక ప్రకటన చేశారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. అవార్డు విజేతలకు తీపికబురు అందించారు. నగదు బహుమతిని భారీగా పెంచినట్లు ప్రకటించారు మంత్రి.
జాతీయ క్రీడా పురస్కారాల నగదు బహుమతులను చివరి సారిగా 2009లో పెంచారు.
" క్రీడలు, సాహస పురస్కారాల నగదు బహుమతి పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. అర్జున అవార్డుకు రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలు, ఖేల్రత్న పురస్కారాలకు రూ. 7.5 లక్షల నుంచి రూ. 25లక్షలకు పెంచాం."
- కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడల శాఖ మంత్రి.
వర్చువల్గా..
తొలిసారి జాతీయ క్రీడా, సాహస పురస్కారాలు-2020 కార్యక్రమాన్ని శనివారం (ఆగస్టు 29) వర్చువల్గా నిర్వహిస్తోంది కేంద్రం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. క్రీడాకారులకు వర్చువల్గా ఈ పురస్కారాలను అందజేయనున్నారు. 60 మంది పురస్కార విజేతలు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ఏఐ, ఎన్ఐసీ కేంద్రాల వద్ద హాజరై.. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు.
దిల్లీలోని విజ్ఞాన్ భవన్ నుంచి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, భారత ఒలంపిక్ సమాఖ్య అధ్యక్షుడు నరేంద్ర ధృవ్ బర్త, ఇతర అధికారులు హాజరుకానున్నారు.
ఇదీ చూడండి: వర్చువల్గా జాతీయ క్రీడా పురస్కార వేడుకకు అంతా సిద్ధం