నిఫా... గతేడాది కేరళను వణికించిన మహమ్మారి వైరస్. ఈ వ్యాధి విజృంభణను ఎలా నియంత్రించాలో తెలియక కేరళ ప్రభుత్వం హడలిపోయింది. ఇప్పుడు మళ్లీ నిఫా ముప్పు పొంచి ఉందని తెలిపారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ.
ప్రమాదకర వైరస్ గురించి ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు శైలజ. వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉందన్నారు. ఈటీవీ భారత్ ముఖాముఖిలో ఈ విషయాన్ని వెల్లడించారు కేరళ ఆరోగ్య మంత్రి.
" ఈ సారి ముందు జాగ్రత్త చర్యలతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేరళలోని ప్రభుత్వ ల్యాబ్, పుణెకు చెందిన బయోలాజికల్ ల్యాబ్ మాకు సాయం అందిస్తోంది."
-కేకే శైలజ, కేరళ ఆరోగ్య మంత్రి.
గతేడాది నిఫా విజృంభించినప్పుడు ఔషధాలు అందుబాటులో లేక, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురైనట్లు వివరించారు శైలజ. నిఫా ఏ ప్రాంతంలోనైనా, ఎప్పుడైనా వ్యాప్తి చెందే అవకాశముందన్నారు మంత్రి. అందరూ అప్రమత్తంగా ఉండాలని, గబ్బిలాలు కొరికిన పండ్లను తినొద్దని సూచించారు.