కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమిలోని విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సిందని, ఆయనకు తీవ్ర అన్యాయం జరిగిందని, సీఎం కుమారస్వామి తాజాగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.
కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఆశిస్తున్న వేళ, కుమార స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అధికార కూటమిలోని విబేధాలు, ముఖ్యమంత్రి కుమారస్వామి తాజా వ్యాఖ్యలు భాజపాకు అస్త్రంగా మారాయి. కుమారస్వామి వెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని మల్లికార్జున ఖర్గేకు అప్పగించాలని భాజపా నేత బీఎస్ యడ్యూరప్ప చురకలంటించారు.
చించోలీ అసెంబ్లీ నియోజవర్గం ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ నిర్వహించిన ఓ బహిరంగసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి పాల్గొన్నారు.