మహారాష్ట్రలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి జరిగిన రాజకీయ పరిణామాలు సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాను తలపించాయి. శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ కూటమి గద్దెనెక్కకుండా గవర్నర్ కోశ్యారీ ఆగమేఘాలపై స్పందించిన తీరు రాజకీయ పండితుల్ని సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. గవర్నర్ కార్యాలయం వేదికగా- భాజపా అమలుచేసిన ఈ ‘మెరుపు వ్యూహం’ గురించి కొద్దిమంది కమలనాథులకే తెలుసు. ఇలా జరగబోతోందని కాంగ్రెస్, ఎన్‌సీపీ నేతలు కలలోనైనా ఊహించలేదు. శనివారం ఉదయం టీవీ స్క్రీన్లపై ఈ వార్తను చూసి విస్తుపోవడం వారి వంతైంది. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల్ని నెలరోజుల నుంచి రాత్రీపగలూ కవర్‌చేస్తూ వచ్చిన టీవీ, ప్రింట్ మీడియా జర్నలిస్టులకు సైతం ‘ఈ అర్ధరాత్రి వ్యూహం’ గురించి ఇసుమంతైనా సమాచారం లేదు. భాజపా నాయకత్వం ఈ ‘ఆపరేషన్’ను అత్యంత గోప్యంగా ఉంచింది.
నెల రోజుల నుంచే..
లోతుగా తరచిచూస్తే.. ఇది ఒక్కరోజులో జరిగింది కాదని, ఈ ‘కుట్ర’ వెనుక గత నెల రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యం ఉందని అర్థమవుతుంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబరు 24వ తేదీ రాత్రికే- భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదన్న విషయం అర్థమయింది. శివసేన-భాజపా కూటమిగా పోటీచేశాయి కాబట్టి.. ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఫలితాల తర్వాత సీను మారింది. తమకూ ముఖ్యమంత్రి పదవి కావాలని శివసేన పట్టుబట్టడం ప్రారంభించింది. సేన ఉద్దేశాలను గమనించిన భాజపా వెంటనే ప్లాన్-బీకి పదునుపెట్టింది. అదే రోజు రాత్రి ఎన్‌సీపీ నేత అజిత్‌పవార్ ఎవరికీ కనిపించకుండా మాయమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎవరితో సమావేశమయ్యారన్నది సస్పెన్స్.
ఎన్‌సీపీలో రెండు వర్గాలు
ఎన్‌సీపీ అగ్రనాయకత్వం రెండు శిబిరాలుగా పనిచేస్తోందని వారి రాజకీయాలను సన్నిహితంగా చూసిన వారు చెబుతారు. భాజపాతో కలిసి వెళదామని వాదించేే వారిలో అజిత్‌పవార్, సునీల్ తత్కారే, ధనుంజయ్ ముండేలు ఉన్నారు. ఇందులో అజిత్ పవార్, సునీల్ తత్కారేలపై అనేక కేసులున్నాయి. దివంగత భాజపా నేత గోపీనాథ్ ముండే మేనల్లుడైన ధనుంజయ్ ముండే మరాఠ్వాడా ప్రాంతంలో శక్తిమంతమైన యువనేత. తనకు వరుసకు సోదరి అయిన పంకజను ఆయన ఎన్నికల్లో ఓడించారు. దేవేంద్ర ఫడణవీస్‌తో ఆయనకు దీర్ఘకాలంగా సత్సంబంధాలున్నాయి. బీజేవైఎంలో ఇద్దరూ అనేక ఏళ్లపాటు కలిసి పనిచేశారు. భాజపాతో జట్టుకడితే సెక్యులరిజం సిద్ధాంతాల్ని ఫణంగా పెట్టినట్లు అవుతుంది కాబట్టి దానితో కలిసి వెళ్లకూడదని వాదించే వర్గం ఎన్‌సీపీలో రెండోది. ఈ వర్గం వెన్నంటి నిలుస్తున్న శరద్‌పవార్ శివసేనతో కలిసి వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేయగా... తొలుత అందరూ దీన్ని ఆమోదించారు. అయితే అప్పటికే అజిత్‌పవార్‌లో తిరుగుబాటు ధోరణి మొదలైంది. ఆయన భాజపాతోనూ మంత్రాంగం నెరపడం ప్రారంభించారు.
సుదీర్ఘ రాజకీయ చర్చలు
అసెంబ్లీ ఫలితాలు వెలువడిన అక్టోబరు 24వ తేదీ నుంచి కాంగ్రెస్-ఎన్‌సీపీ-శివసేన మధ్య జరుగుతున్న చర్చల్ని జాగ్రత్తగా గమనిస్తున్న కమలనాథులు ఆ శిబిరంలో నుంచి కలిసివచ్చే వారి కోసం వేచిచూశారు. చర్చల్లో పురోగతిని అజిత్‌పవార్ ఎప్పటికప్పుడు భాజపా శిబిరానికి చేరవేసినట్లు సమాచారం. శుక్రవారం శివసేన-కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయింది. ఇది అజిత్‌పవార్‌కు, భాజపాకు పెద్ద షాక్ ఇచ్చింది. అజిత్‌పవార్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు మిగిలాయి. తన బాబాయ్ శరద్‌పవార్‌తో కలిసి వెళ్లడం లేదా, తన సొంత ప్రణాళికను అమలుచేయడం. రెండోదానివైపే ఆయన మొగ్గు చూపారు.
అర్ధరాత్రి ఆకర్షణ రాజకీయం ఇలా...
ప్రభుత్వం ఏర్పాటుపై శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లు తొలిసారిగా భేటీ అయ్యాయి. ఆదిత్య ఠాక్రే నియోజకవర్గమైన వర్లీలోని నెహ్రూ సెంటర్‌లో రెండుగంటలకుపైగా ఈ సమావేశం సాగింది. తొలుత శరద్ పవార్ బయటకు వచ్చి ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రకటించారు. తరువాత వచ్చిన ఉద్ధవ్ మరో దఫా చర్చలు జరుగుతాయని శనివారం విలేకరుల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈలోగా అత్యవసర పని ఉందంటూ శరద్ పవార్ హడావిడిగా వెళ్లిపోయారు. ఎక్కడ నుంచైనా ఏదైనా ఉప్పందిందా అన్నది తెలియదు. అజిత్ వ్యవహారమే అయి ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి.
రాత్రి 9.30 గంటలకు మొదలు..