శీతాకాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో హిమాలయ పర్వత సానువుల్లో శాంతి నెలకొల్పేందుకు భారత్-చైనా మరోసారి సైనిక చర్చలు నిర్వహించనున్నాయి. వచ్చేవారం ఏడో విడత కమాండర్ స్థాయి భేటీ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి-అటు చైనా.. ఇటు శీతాకాలం.. భారత్ దేనికైనా రె'ఢీ'
చైనా సైన్యంతో జరిగే ఈ సమావేశంలో 14 కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ భారత్ తరఫున చర్చలకు నేతృత్వం వహిస్తారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. భారత మిలిటరీ అకాడమీ(ఐఎంఏ)లో సేవలందించేందుకు లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ త్వరలో దెహ్రాదూన్‌కు వెళ్లనున్న నేపథ్యంలో 14వ కార్ప్స్ కమాండర్‌గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్ కూడా చర్చలకు హాజరవుతారని పేర్కొన్నారు.
"పీఎల్ఏతో చర్చలకు హాజరయ్యే బృందంలో 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ సహా పలువురు ఉన్నారు. ఐఎంఏ కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ దెహ్రాదూన్‌కు వెళ్లనున్నారు. అందువల్ల, పరిస్థితులపై అవగాహన కోసం చివరిసారి(సెప్టెంబర్ 21న) జరిగిన సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ మేనన్ సైనిక చర్చలకు హాజరయ్యారు."
-అధికారులు
ప్రస్తుతం ఐఎంఏ కమాండెంట్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ జైవీర్ సింగ్ నేగి బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. అయితే సరిహద్దులో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా ఐఎంఏకి వెళ్లేందుకు లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ మరికొంత సమయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ ఐఎంఏకి పయనమైన తర్వాత 14 కార్ప్స్ కమాండర్‌గా లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ పగ్గాలు చేపట్టనున్నారు.