తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గజరాజుకు పసందైన విందు.. భక్తులకు కనువిందు! - గణేశుడు

కేరళలో సంప్రదాయ ఆనయుట్టు వేడుకలు ప్రారంభమయ్యాయి. శివాలయ ప్రాంగణంలో గజాననుడి కోసం విందు  ఏర్పాటు చేశారు. ఆహ్వానాన్ని మన్నించి 70 ఏనుగులు విచ్చేశాయి. భక్తులంతా తమ చేతుల మీదుగా ఆహారం అందించి, ఆనందించారు.

గజరాజుకు పసందైన విందు.. భక్తులకు కనువిందు!

By

Published : Jul 22, 2019, 9:07 PM IST

గజరాజుకు పసందైన విందు.. భక్తులకు కనువిందు!
కేరళలో ఏటా జరుపుకునే ఆనయుట్టు పండుగ ఈ సారీ ఘనంగా మొదలైంది. త్రిస్సూర్​లోని వడక్కునాథన్​ ఆలయ ప్రాంగణంలో దాదాపు 70 ఏనుగులకు విందు ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు స్వయంగా తమ చేతులతో గజాల నోటికి ఆహారాన్ని అందించి మురిసిపోయారు.

గజనాథులను గణేశుడిగా కొలుస్తారు ఇక్కడి ప్రజలు. అందుకే ఆషాడమాసంలో లంబోదరుడి భారీ బొజ్జను నింపేందుకు నైవేద్యాలు సమర్పిస్తారు. పంటలు బాగా పండి, సిరిసంపదలు పెరగాలని ప్రతి ఏడాది వర్షకాల ఆరంభంలోనే గజరాజును ఇలా ప్రార్థించడం ఆచారం.

శైవ క్షేత్రమైన వడక్కునాథన్​ ఆలయంలో భారీ భద్రతల నడుమ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏనుగులన్నీ వరుసగా నిల్చున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

పదివేల ఎనిమిది కొబ్బరికాయలు, 500 కిలోల అటుకులు, 300 కిలోల మరమరాలు ఈసారి ఏనుగుల విందు మెనూలో ఉన్నాయి. 150 కిలోల నువ్వులు, 150 కిలోల నెయ్యి, 2 వేల 500 కిలోల బెల్లం, చెరకుగడలు, 500 కిలోల బియ్యంలో పసుపు, బెల్లం, నూనె, తొమ్మిది రకాల ఫలాలతో ప్రత్యేకమైన నైవేద్యాన్నీ గజేంద్రులకు సమర్పించారు.

ఈసారి ఆనయుట్టులో మరో ప్రత్యకత ఉంది. మొదటిసారిగా ఏడు ఆడ ఏనుగులు ఈ విందుకు హాజరయ్యాయి.

ఒకే సారి అతిగా తినేస్తే గజాలు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉన్నందున చివరిలో జీర్ణక్రియకు తోడ్పడే తాంబూలాలూ ఇస్తారు. అంటే.. ఏనుగు చికిత్సలో అనుభవజ్ఞులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయుర్వేద మూలికలు ఇస్తారన్న మాట!

ఇదీ చూడండి:జాబిల్లి కోసం: చంద్రయాన్​-1 సూపర్​ హిట్​.. కానీ...

ABOUT THE AUTHOR

...view details