కేరళ సచివాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాద ఘటన అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది. బంగారం కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలను ధ్వంసం చేసేందుకు సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఘటనపై ఎన్ఐఏ బృందంతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.
అయితే కాంగ్రెస్, భాజపాలు కుట్రపన్నే ఇలా చేస్తున్నాయని కేరళ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తునకు నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నిపుణుల బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది.
చెలరేగిన మంటలు..
కేరళ సచివాలయం నార్త్ బ్లాక్ ప్రోటోకాల్ విభాగం రెండో అంతస్తులో మంగళవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. భవనం నుంచి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వీటిని అదుపు చేశారు. గదిలో పలు పత్రాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
ఘటన జరిగిన అనంతరం భాజపా కార్యకర్తలతో కలిసి సచివాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుందరన్. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అగ్ని ప్రమాద ఘటనను నిరసిస్తూ కోజికోడ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం వైపు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ఇవీ చూడండి: