'ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు, సొలుపేమున్నది' అని ఓ కవి రాసిన అక్షర సత్యాన్ని ఈ తరం పిల్లలకు తెలియచెబుతోంది కేరళ ప్రభుత్వం. విద్యార్థుల్ని పొలం బాట పట్టించి... ఘన సంస్కృతిని కాపాడుకునేందుకు యత్నిస్తోంది.
పల్లెకు పోదాం చలో చలో...
కేరళ రాష్ట్ర విద్యా, వ్యవసాయ శాఖలు ఉమ్మడిగా 'సురక్షిత కొల్లం జిల్లా' కార్యక్రమం నిర్వహించాయి. పూర్వం జానపద పాటలతో వ్యవసాయం చేసిన రోజులను కళ్లకుకట్టేలా ఏర్పాట్లు చేసి.. బడి పిల్లలకు సేద్యంలోని మాధుర్యాన్ని రుచి చూపించే వినూత్న కార్యక్రమం చేపట్టాయి. విద్యార్థులను బడి నుంచి నేరుగా పొలాల్లోకి తీసుకెళ్లి యూనిఫాంలోనే వారితో వ్యవసాయం చేయించారు అధికారులు.
నిత్యం ఇరుకు గదుల్లో, గంపెడు సిలబస్లతో భారంగా గడిపే వారు వీరంతా. ఇలా గాలికి ఎగిరే సీతాకోకల్లా.. వరిపైరు చేత పట్టి, మడిలో నాటుతుంటే కొత్తగా అనిపించింది వారికి. భవిష్యత్తులో తామూ వ్యవసాయం చేసుకుని, లాభాలు అర్జిస్తూ బతికేయొచ్చన్న భరోసా కలిగించింది.