భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంటే.. తొలి కేసు నమోదైన కేరళలో పరిస్థితి విభిన్నంగా ఉంది. ప్రకృతి ప్రళయాలు, వైరస్ రక్కసులను గుండె ధైర్యంతో ఎదుర్కొన్న ఈ రాష్ట్రం.. ఇప్పుడు అదే స్థైర్యంతో కొవిడ్ మహమ్మారితోనూ గట్టిగా పోరాడుతోంది. అందుకే ఆ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లా దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఏకంగా ఈ ప్రాంతంలో నమోదైన కేసుల్లో.. 37 శాతం మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా కోలుకున్నవారి శాతంలో ఇదే అత్యధికం. భారత్ మొత్తం సగటు 11.4గా ఉండగా.. అమెరికాలో 5.7 శాతం మాత్రమే కొవిడ్-19 నుంచి బయటప్డడారు.
ఒక్కరోజే 26 మంది...
కాసరగోడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 26 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. రెండో దశ వ్యాప్తిలో 165 మందికి కరోనా సోకగా.. 60 మంది కోలుకున్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు వేగవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా కొత్త కేసులు నమోదుకావట్లేదు. సామాజిక సర్వే చేపట్టి కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తోంది అక్కడి యంత్రాంగం. అంతేకాకుండా పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు రాబడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం... కేరళలో మొత్తం 376 కేసులు నమోదు కాగా.. 179 కోలుకున్నారు. ముగ్గురు మరణించారు.