మసీదులో అంగరంగ వైభవంగా హిందూ పెళ్లి కేరళ అలెప్పీలో మతసామరస్యం, మానవత్వం ఒకే చోట వెల్లివిరిశాయి. నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహం.. ఇస్లాం జమాత్ మసీదులో జరిపించారు ముస్లిం సోదరులు.
కేరళ అలప్పుఝాలోని చేరువల్లిలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన అంజు అనే యువతి వివాహం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటూ.. సాయం చేయాలని ముస్లిం జమాత్ మసీదు కమిటీని ఆశ్రయించింది ఆమె తల్లి. మానవత్వంతో పేదింటి ఆడబిడ్డ వివాహం జరిపించేందుకు ముందుకు వచ్చారు కమిటీ సభ్యులు. మసీదులోనే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించి ఆదర్శంగా నిలిచారు.
"గతంలో నేను వ్యక్తిగతంగా వారి చిన్నబిడ్డ చదువుకు సాయం చేశాను. ఈ సారి అంజు పెళ్లి చేసే స్తోమత లేదని ఆమె తల్లి మా వద్దకు వచ్చి అడిగినప్పుడు.. మా కమిటీ వారికి ఎలాగైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. "
-నుజుముద్దీన్ అలుమ్మూట్టి, మసీదు సెక్రెటరీ
మసీదులో పెళ్లంటే ఏదో నామమాత్రంగా జరిగి ఉంటుందనుకుంటే పొరపాటే.. మసీదు ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అంజు, శరత్‌ల జంట.. పెళ్లి జరిగింది. ముహుర్త సమయం 11:30 గంటలకు అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. 1000 మంది అతిథులకు శాఖాహార విందు ఏర్పాటు చేశారు. అంతేకాదు దాదాపు 8 తులాల బంగారం, ఖర్చులకు రూ.2 లక్షలు అందించి సహృదయాన్ని చాటుకున్నారు మసీదు కమిటీ సభ్యులు.
సీఎం ఖుష్...
ఐక్యమత్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ వివాహ వేడుకపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతోషం వ్యక్తం చేశారు. పేస్బుక్ ద్వారా కొత్త జంటను దీవించారు. పెళ్లి ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నారు.
"ఐక్యమత్యానికి కేరళ ఉదాహరణ. చేరవెల్లి ముస్లి జమాత్ మసీదు ప్రాంగణం హిందువులైన అంజు, శరత్‌ల వివాహానికి వేదికైంది. అంజు తల్లి కోరగానే, సాయం చేసేందుకు ముందుకు వచ్చింది మసీదు కమిటీ. కొత్తజంటకు నా శుభాకాంక్షలు. ఇరువురి కుటుంబాలకు, మసీదు నిర్వాహకులకు, చేరవెల్లి ప్రజలకు నా అభినందనలు." -పినరయి విజయన్, కేరళ సీఎం