కరోనా దెబ్బకి దేశంలో ఎన్-95 మాస్క్‌లే కాదు.. సాధారణ సర్జికల్ మాస్క్‌లకూ కొరత ఏర్పడింది. కేరళలో మాస్క్‌ల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు విభిన్నరీతిలో సాయపడుతున్నారు అక్కడి ప్రజలు. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ సేవాసంస్థ వారు అమెరికా నుంచి ఫ్యాబ్రిక్‌ను తెప్పించి మాస్క్‌లు ఉత్పత్తి చేసి, ఉచితంగా పంచుతున్నారు. కన్నూరు జిల్లాకు చెందిన మహిళలేమో వస్త్త్రాలతోనే ముఖాలకు ముసుగులు కుట్టేస్తున్నారు.
నేత వస్త్రాలతోనే ముసుగులు
కన్నూరు జిల్లా, తాలిపరంబుకు చెందిన 'కుడుంబశ్రీ' స్వయం సహాయక సంఘం సభ్యులు వస్త్ర బ్యాగులు తయారు చేస్తారు. రాష్ట్రంలో మాస్క్‌ల కొరత ఏర్పడడం వారిని తీవ్రంగా కలచివేసింది. మాస్క్‌లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోలేకపోతున్నామని గ్రహించిన మహిళలు.. నేత వస్త్రాలతోనే ముఖాలకు ముసుగులు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. పరియరమ్ గ్రామస్థుల ప్రోత్సాహంతో వస్త్ర మాస్క్‌లు తయారు చేసి సరసమైన ధరలకే విక్రయిస్తున్నారు.