తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో నిఫా పంజా... కేంద్రం అప్రమత్తం

కేరళ ఎర్నాకుళం జిల్లాలో 23ఏళ్ల విద్యార్థికి నిఫా వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. అప్రమత్తమైన కేంద్రం ఆరుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది. వైరస్​ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఆందోళన పడొద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ భరోసా ఇచ్చారు.

నిఫా కలకలం

By

Published : Jun 4, 2019, 4:15 PM IST

Updated : Jun 4, 2019, 8:08 PM IST

కేరళలో నిఫా పంజా... కేంద్రం అప్రమత్తం

కేరళలో మరోసారి నిఫా వైరస్​ పంజా విసిరింది. ఎర్నాకుళం జిల్లాలో 23 ఏళ్ల విద్యార్థికి వైరస్​ సోకినట్టు కేరళ ప్రభుత్వం నిర్ధరించింది. నిఫా లక్షణాలతో కోచిలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చేరిన అతనికి రోగ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. అతడి రక్త నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపగా నిఫా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు.

ఇడుక్కి తోడుపుళాలోని ఓ కళాశాల విద్యార్థి క్యాంప్‌ నిమిత్తం 4 రోజుల పాటు త్రిశూర్‌ వెళ్లాడు. క్యాంప్‌ నుంచి జ్వరంతో తిరిగొచ్చిన విద్యార్థి కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. జ్వరం లక్షణాలు నిఫా వైరస్​ను పోలి ఉండటం గమనించిన వైద్యులు.. ఎన్​ఐవీకి పంపి నిర్ధరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ ధ్రువీకరించారు.

పరిసర జిల్లాల్లో అలర్ట్​

విద్యార్థిని పరీక్షించిన నర్సులూ ఆసుపత్రిలో చేరారు. వారిని ప్రత్యేక పర్యవేక్షణలో పెట్టారు. ఈ మధ్య కాలంలో విద్యార్థితో సన్నిహితంగా మెలిగిన మరో 86 మందిని పర్యవేక్షణలోనే ఉంచారు. దీనిపై ప్రజలు కంగారు పడాల్సింది ఏమీ లేదని, నిఫా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని శైలజ తెలిపారు. ఎర్నాకుళం, త్రిశూర్‌, కోజికోడ్‌ జిల్లాల్లో నిఫాపై అలర్ట్‌ ప్రకటించామన్నారు. రోగులకు చికిత్స అందించే సిబ్బందికి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు.

హుటాహుటిన కేంద్ర బృందం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ సూచించారు.

"అధికారులందరితో ఈ విషయమై సమావేశమయ్యా. నిన్ననే ఆరుగురు సీనియర్ అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపాం. రాష్ట్ర ఆరోగ్య మంత్రితో మాట్లాడాను. ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నాం. కేరళకు మోనో క్లోనల్​ ఆంటీ బాడీస్​ను పంపిస్తున్నాం. దిల్లీలోని ఎన్సీడీసీలో కంట్రోల్​ రూంను ఏర్పాటు చేశాం. సాధ్యమైనంత మేరకు అన్ని రకాలుగా కేంద్రం సాయం చేస్తుంది."

-హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్య మంత్రి

2018 మేలో నిఫా వైరస్‌ కారణంగా కేరళలోనే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. నిఫా లక్షణాలతో కోజికోడ్‌లో 14 మంది, మలప్పురంలో ముగ్గురు మృతిచెందారు. నిఫా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ వల్ల తొలి దశలో తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి కలుగుతుంది. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది తలెత్తుతుంది.

ఇదీ చూడండి: కేరళలో నిఫా వైరస్‌ కలకలం

Last Updated : Jun 4, 2019, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details