ఓ అందమైన యువతి, ప్రమాదవశాత్తు దివ్యాంగుడైన ఓ యువకుడిని ప్రేమించింది. వద్దని వారించిన పెద్దలను ఎదిరించి, చివరికి ఒప్పించి మరీ అతనిని పెళ్లి చేసుకుంది. ఏంటీ సినిమా కథ అనుకుంటున్నారా? కానేకాదు ఇది నమ్మశక్యం కాని ఓ యథార్థగాథ.
కేరళ త్రిశూర్ జిల్లాలోని తాజెకాడ్కు చెందిన యువకుడు ప్రణవ్. ఆరేళ్ల క్రితం విద్యార్థిగా ఉన్నప్పుడు బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణమైతే నిలిచింది కానీ తుంటి కింద భాగం మొత్తం చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకే పరిమితమైపోయాడు. ప్రాథమిక అవసరాల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు.
ఆత్మవిశ్వాసం
తన పరిస్థితిని చూసుకొని ప్రణవ్ ఏ మాత్రం నిరుత్సాహపడలేదు. ఆత్మవిశ్వాసం కోల్పోయి... నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు తరచుగా వెళుతుండేవాడు. చక్రాల కుర్చీలోనే కూర్చొని పండుగలను ఆస్వాదిస్తుండేవాడు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.
అదే సమయంలో తిరువనంతపురానికి చెందిన షహానా... అనుకోకుండా ఓ రోజు ప్రణవ్ వీడియోలను చూసింది. ఫేస్‌బుక్‌లోని ప్రణవ్ ఫోన్ నంబర్ తీసుకొని అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ప్రణవ్‌కు తన ప్రేమను వ్యక్తపరిచిన షహానా.. పెళ్లి ప్రతిపాదన చేసింది.