కేరళను మరోసారి వరదలు ముంచెత్తాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. 4 జిల్లాల్లో రెడ్‌అలెర్ట్ ప్రకటించారు. వయనాడ్, ఇడుక్కి, మల్లపురం, కోజికోడ్ జిల్లాల్లో వరద పరిస్థితి దారుణంగా ఉంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రవాణా వ్యవస్థ స్తంభించింది. వరదల్లో చిక్కుకుని సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
ప్రాజెక్టుల.. నీటిమట్టాలు గరిష్ఠ స్థాయిని దాటడం వల్ల దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ 300లకు పైగా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. దాదాపు 30వేల మందిని తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జాతీయ విపత్తు నిర్వాహణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.