కేరళ పీసీసీ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార బాధితురాలిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అత్యాచారానికి గురైన మహిళను వ్యభిచారితో పోల్చారు. ఆత్మగౌరవం ఉన్న మహిళ అయితే ఎంతమాత్రం ప్రాణాలతో ఉండబోరని పేర్కొన్నారు. అధికార ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాసేపటికే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.
కేరళ కాంగ్రెస్ సారథి వివాదాస్పద వ్యాఖ్యలు - kerala congress ramachandran leader sensational comments on raped victim
కేరళ కాంగ్రెస్ నేత ముళ్లపల్లి రామచంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారానికి గురైన మహిళలు ఆత్మాభిమానం ఉంటే ప్రాణాలు తీసుకుంటారని అన్నారు.
సోలార్ కుంభకోణం కేసులో విజయన్ ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని రామచంద్రన్ ఆదివారం ఆరోపించారు. తనపై నాటి యూడీఎఫ్ మంత్రులు పదే పదే అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "రోజూ లేచింది మొదలు ఫలానా వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని ఆమె చెబుతోంది. విజయన్ ప్రభుత్వం కావాలనే ఇలాంటి ఆరోపణలు చేయిస్తోంది. ఆ పాచికలు ఎంతమాత్రం పారవు. అయినా, ఆత్మగౌరవం ఉన్న ఏ మహిళయినా తనపై అత్యాచారం జరిగితే ప్రాణాలతో నిలవదు. లేదంటే మరోసారి అత్యాచారం జరగ్గకుండా జాగ్రత్త పడుతుంది" అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యభిచారిలా మాట్లాడుతోందంటూ తీవ్రంగా ఆరోపించారు. అక్కడికి కాసేపటికే మాట్లాడిన వేదికపైనే తన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉంటే క్షమించాలని కోరారు. ఆయన వ్యాఖ్యలను కేరళ మంత్రి కేకే శైలజ ఖండించారు. నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సిన వారే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.