కేజ్రివాల్‌ను హత్య చేయాలని చూస్తున్నారా: సిసోడియా దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌పై జరిగిన దాడిని ఆమ్ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడి వెనుక భాజపా హస్తం ఉందని ఆరోపించింది.
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ను భాజపా చంపేందుకు ప్రయత్నిస్తోందా అని ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రివాల్‌ను నైతికంగా ఏమీ చేయలేక, ఎన్నికల్లో ఓడించలేక భాజపా ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
"కేజ్రివాల్‌ను హత్య చేయాలని మోదీ, అమిత్‌షా కోరుకుంటున్నారా? ఈ విధంగా అడ్డుతొలగించాలనుకుంటున్నారా? మీ దురాగతాలకు ముగింపు పలికేది కేజ్రీవాలే."- మనీశ్ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి ట్వీట్
ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు
ముఖ్యమంత్రి కేజ్రివాల్‌పై దాడిని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఖండించారు. ఈ దాడి వెనుక భాజపా కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఎన్ని దాడులు చేసిన ఆప్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆన్నారు.
"రోడ్‌షో సమయంలో కేజ్రివాల్‌పై దాడి చేశారు. ఈ పిరికిపంద చర్యను మేము ఖండిస్తున్నాం. దాడులతో... దిల్లీలో ఆప్ ప్రభంజనాన్ని ఆపలేరు." -సౌరభ్ భరద్వాజ్ , ఆప్ అధికార ప్రతినిధి
ఆప్ నాటకాలు ఆడుతోంది
ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపణలను దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ తిప్పికొట్టారు. ఆప్ పథకం ప్రకారం 'దాడి' నాటకాలు ఆడుతోందని ప్రత్యారోపణలు చేశారు.
"మేము హింసను ప్రోత్సహించం. అలాంటి చర్యలకు పాల్పడేవారినీ సమర్థించం. అయితే ఎన్నికల సమయంలోనే ఎందుకు కేజ్రివాల్‌పై దాడి జరిగింది. నాకు అనుమానంగా ఉంది. ఈ దాడి నాటకానికి కేజ్రివాలే పథకం వేసి ఉండొచ్చు." -మనోజ్ తివారి,దిల్లీభాజపా అధ్యక్షుడు
ఇదీ జరిగింది..
దిల్లీ మోతీనగర్‌లో ఆప్ ఎంపీ అభ్యర్థి బ్రిజేష్ గోయల్ తరుపున కేజ్రివాల్ నేడు ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై ఎర్ర చొక్కా వేసుకున్న ఓ యువకుడు దాడిచేశాడు. అకస్మాత్తుగా జీపుపైకి ఎక్కి ఆయనను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే అతడిని పట్టుకున్న ఆప్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం నిందితుడు తమ కస్టడీలోనే ఉన్నాడని, అతనిని కైలాస్ పార్క్ ప్రాంతానికి చెందిన సురేష్‌గా గుర్తించామని, దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
కేజ్రీవాల్‌పై ఇలా భౌతిక దాడి జరగడం ఇది రెండోసారి. గతంలో ఆయనపై ఇంకు, స్ప్రేతోనూ దాడులు జరిగాయి.
ఇదీ చూడండి: 'మసూద్ విషయంలో భాజపా చేసిందేమీ లేదు'