కేజ్రీవాల్.. దిల్లీ ఎన్నికల్లో మూడోసారి ఆప్‌కు అపూర్వ విజయం అందించిన నేత. కేంద్రంలోని భాజపా అధికార బలాన్ని ఎదుర్కొని ‘పని రాజకీయంతో దిల్లీ ఓటరును తనవైపు తిప్పుకోగలిగిన గొప్ప వ్యూహకర్త.. ముచ్చటగా మూడోసారి దిల్లీ సీఎంగా ప్రమాణం చేయనున్న సామాన్యుడు. ముక్కుసూటితనం.. ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని భయపడకుండా బయటకు చెప్పగలిగే ధైర్యం ఆయన సొంతం. అలాంటి కేజ్రీలో మరో కోణం కూడా ఉంది. ఆయన ఓ గొప్ప ప్రేమికుడు. తన సతీమణి సునీతతో ఆయనది ప్రేమ వివాహం. కేజ్రీవాల్- సునీత ప్రేమాయణం ఎలా మొదలైందంటే..
వాల్ లవ్‌స్టోరీ.. అలా మొదలైంది..! అవి కేజ్రీవాల్ సివిల్స్ పరీక్ష రాసి ఐఆర్‌ఎస్‌కు ఎంపికైన రోజులు.. కేజ్రీవాల్, సునీత ఇద్దరూ నాగ్‌పుర్‌లోని ఐఆర్‌ఎస్ అకాడమీలో శిక్షణ కోసం వచ్చారు. అప్పుడే తన జీవిత భాగస్వామి సునీతను తొలిసారి కలిశారు. కేజ్రీవాల్ వ్యక్తిత్వం సునీతను ఎంతగానో ఆకట్టుకుంది. అరవింద్ కేజ్రీవాల్ నిజాయతీ, దేశానికి సేవ చేయాలనే సంకల్పం, నిబద్ధత ఆయన పట్ల ప్రేమను మరింత రెట్టింపు చేసింది. అప్పుడే కేజ్రీవాల్‌తో కలిసి నడవాలని ఓ నిర్ణయానికి వచ్చేశారట. సునీత వైపు నుంచే కాదు.. కేజ్రీవాల్ కూడా ఆమెను ప్రేమించారు. కానీ ఇద్దరూ తమ ప్రేమను బయటపెట్టేందుకు చాలా సమయం పట్టింది. చాలా కాలం తర్వాత తమలోని ప్రేమను వారిద్దరూ పరస్పరం వ్యక్తపరుచుకున్నారట. నిజాయతీ, పరస్పరం గౌరవించుకోవడం, అర్థం చేసుకోవడం వంటి పునాదులపై నిలిచిన వారిద్దరి ప్రేమ.. వివాహ బంధంగా మారింది.
వాల్ లవ్‌స్టోరీ.. అలా మొదలైంది..! సునీత కుటుంబ సభ్యులు దిల్లీలో స్థిరపడగా.. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు హరియాణాలోని హిస్సార్‌లో ఉండేవారు. ఇరు కుటుంబాలూ వీరి ప్రేమను తొలుత వ్యతిరేకించినా ఆ తర్వాత సమ్మతం తెలిపారట. అనంతరం వీరిద్దరికీ 1994 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత పెళ్లికి రెండు నెలల సమయం ఉన్నందున ఇద్దరూ సినిమాలకు వెళ్లడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. ఇలా తమ ప్రేమ బంధాన్ని మరింత దృఢ పరుచుకొని ఎంతో అందంగా మలచుకున్నారు. అనంతరం 1994 నవంబర్‌లో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ ఐఆర్‌ఎస్ శిక్షణను పూర్తి చేసుకొని దిల్లీకి మారారు.
వాల్ లవ్‌స్టోరీ.. అలా మొదలైంది..! దేశానికి సేవచేయాలన్న కేజ్రీవాల్ దృఢ సంకల్పం ఆయన్ను ఐఆర్‌ఎస్ ఉద్యోగంలో ఎంతోకాలం ఉండనీయలేదు. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ ప్రజా సమస్యలను అధ్యయనం చేసేవైపు వెళ్లారు. దీంతో కుటుంబ పోషణ భారమంతా సునీతపై పడింది. దంపతులిద్దరూ ఒకరికొకరు అర్థంచేసుకుంటూ పరస్పరం సహకరించుకోవడం ద్వారా కుటుంబ సమస్యలను అధిగమిస్తూ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వారిద్దరి మధ్య అన్యోన్యత కేజ్రీవాల్‌కు ఎదురులేకుండా చేసింది. కుటుంబ సమస్యలను సునీత అధిగమించడంతో పాటు దేశ సేవ చేయాలనే కేజ్రీవాల్ సంకల్పానికి ఆమె ఏనాడూ అడ్డుతగల్లేదు. కేజ్రీవాల్‌కు కుమార్తె హర్షిత కేజ్రీవాల్, కుమారుడు పులకిత్ కేజ్రీవాల్ ఉన్నారు. ప్రతి మగాడి విజయం వెనుక మహిళ ఉంటుందని మన పెద్దలు చెప్పిన సామెతను రుజువు చేస్తూ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు కేజ్రీవాల్ - సునీత కేజ్రీవాల్ దంపతులు.
వాల్ లవ్‌స్టోరీ.. అలా మొదలైంది..!