కశ్మీరీ పర్యటకం హౌస్‌బోట్స్ లేకుండా అసంపూర్ణమనే చెప్పుకోవాలి. సుందరమైన నదీజలాలపై తేలియాడుతూ ప్రయాణం చేసే పడవలఇళ్లు... కశ్మీర్ అందాలను ద్విగుణీకృతం చేస్తాయి. ఇలాంటి చారిత్రక వైభవం ఉన్న హౌస్‌బోట్స్ ప్రస్తుతం కళ కోల్పోతున్నాయి. అధికారుల అలసత్వం, ప్రస్తుత పరిస్థితుల కారణంగా నౌకలు వైభవం కోల్పోయి, యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
1990 నుంచి పర్యటక రంగం పరిస్థితి స్థిరంగా లేదు. ఫలితంగా హౌస్ బోట్స్ వారసత్వంపై చెడు ప్రభావం పడింది. ఇప్పటికే చాలా పడవలు శిథిలమయ్యాయి. మరికొన్నింటిని బాగుచేయాలి. హౌస్‌బోట్స్...పర్యటకులకు ఇక్కడి చరిత్రను కళ్లకు కడతాయి. కశ్మీరీ పర్యటకాన్ని 150 ఏళ్లుగా కాపాడుతూ వస్తున్నాయివి. దశాబ్దాల క్రితం...పర్యటకుల బస కోసం సరైన సదుపాయాలు ఇక్కడ ఉండేవి కాదు. ఆ లోటును హౌస్‌బోట్స్ భర్తీ చేశాయి. కశ్మీర్‌ను అద్భుతమైన పర్యటక కేంద్రంగా ప్రపంచస్థాయిలో నిలబెట్టాయి. ఇప్పుడు కశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రచారం అక్కర్లేదు. శతాబ్దం క్రితమే ఈ ప్రాంతానికి కావల్సినంత ప్రచారం జరిగింది. కశ్మీర్‌లో 1080 హౌస్ బోట్స్ ఉండేవి. వాటి సంఖ్య ప్రస్తుతం 900కు తగ్గిపోయింది. చాలా పడవలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. అందుకు యజమానుల వద్ద సరిపడా డబ్బులేదు. ప్రభుత్వం ఏదైనా సహకారమందిస్తే బాగుంటుంది.
--అబ్దుర్ రషీద్, జనరల్ సెక్రటరీ, హౌస్‌బోట్ యజమానుల సంఘం
ఏడాది సమయం :
నాణ్యమైన దేవదారు కలపతో....నిపుణులైన వడ్రంగి పనివాళ్లు ఒక్క హౌస్ బోట్ తయారు చేసేందుకు ఏడాదికి పైగా సమయం తీసుకుంటారు. కశ్మీరీ కళాకారులు తమ సునిశిత కళతో..పడవ లోపలా, బయటా అందంగా తీర్చిదిద్దుతారు. అలా తయారై నీటిపై తేలియాడే ఈ పడవఇళ్లు... స్థానిక వారసత్వ సంపదను, కళాకారుల నైపుణ్యాలను కళ్లకు కడతాయి. 1838లో బ్రిటిష్ అధికారులు....సెలవుల్లో కశ్మీర్‌కు పర్యటనకు వచ్చారు. డల్ సరస్సులోని పడవ ఇళ్లలోనే వాళ్లు బస చేసేవారు. అప్పటినుంచే కశ్మీర్‌లో పర్యాటక రంగం అభివృద్ధి ప్రారంభమైంది. పడవఇళ్ల వైభవంతోపాటే, కశ్మీరీ పర్యటకం కూడా అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఏదేమైనా...అప్పటి హౌస్ బోట్ల కంటే ప్రస్తుతం కనిపిస్తున్న బోట్లు ఎంతో అందంగా ఉంటాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం హౌస్ బోట్లతో కళకళలాడేదనీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని యజమానులు చెప్తున్నారు. స్థానిక అధికారులు పట్టించుకుంటే... కశ్మీరీ చారిత్రక సంపద అంతరించిపోకుండా కాపాడుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.