పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2018లో జమ్ముకశ్మీర్‌లో చొరబడేందుకు 328 సార్లు ప్రయత్నించాయని.. అందులో 143 సార్లు విజయం సాధించాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో ఉగ్రవాదులు చొరబడటం ఇదే తొలిసారని నివేదిక స్పష్టం చేసింది.
ఏడాదిలో 614 ఉగ్ర ఘటనలు
2018లో జమ్ముకశ్మీర్‌లో 614 ఉగ్ర ఘటనలు జరిగాయని.. ఇందులో మొత్తం 257 మంది ముష్కరులు, 91 మంది భద్రతా సిబ్బంది, 39 మంది పౌరులు మరణించారని నివేదిక పేర్కొంది. గత ఐదేళ్లలో అత్యధిక ప్రాణ నష్టం గత ఏడాదే జరిగిందని వెల్లడించింది. 2017లో జమ్ముకశ్మీర్‌లో 342 ఉగ్రవాద ఘటనలు జరగగా 213 మంది ముష్కరులు, 80 మంది భద్రతా సిబ్బంది, 40 మంది పౌరులు మరణించారని నివేదిక తెలిపింది.
ఉగ్రవాద, వేర్పాటు వాద హింసతో జమ్ముకశ్మీర్ తీవ్రంగా ప్రభావితమైందన్న కేంద్ర ప్రభుత్వ నివేదిక.. రెండున్నర దశాబ్దాలుగా దాయాది దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో 1990 నుంచి ఇప్పటి వరకు 14 వేల మంది పౌరులు, 5 వేల 273 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని హోం మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది.
ఇదీ చూడండి: పీఓకేలో ఉగ్రవాదుల ప్రభుత్వమే నడుస్తోంది: రావత్