రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లోనే జమ్ముకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించే '35-ఎ'నూ ప్రస్తావించారు. అసలు ఆర్టికల్ 35-ఎ లో ఏముంది? ఈ నిబంధనలను మార్చొద్దని జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలు ఎందుకు పట్టుపట్టాయో ఓ పరిశీలన.
ఆర్టికల్ 370లో 35-ఎ నిబంధన ఒక భాగం
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370లో 35-ఎ నిబంధన ఒక భాగం. ఈ నిబంధన కశ్మీర్‌లోని శాశ్వత నివాస నిబంధనలను సమగ్రంగా విశదీకరిస్తుంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత షేక్ అబ్దుల్లా, నాటి ప్రధాని నెహ్రూ మధ్య 1952 జులైలో కుదిరిన దిల్లీ ఒప్పందం ప్రకారం కశ్మీరీలందరికీ భారత పౌరసత్వం ఇస్తారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించడం కోసం చట్టాలు చేసే అధికారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఉంటుంది. ఈ నిబంధనల్నే 1954 మే 14న రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 35ఏ కింద చేర్చారు. అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
కశ్మీరీలకే పరిమితం
ఆర్టికల్ 35-ఎ ప్రకారం భారత భూభాగానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లోని వారు కశ్మీర్‌లో భూ క్రయవిక్రయాలు చేయడం నిషేధం. ఒక వేళ చేసినా అది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. 1954 మే 14న కన్నా ముందు లేదా ఆ తేదీ నాటికి జన్మించిన వ్యక్తి లేదా పదేళ్లు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి మాత్రమే కశ్మీర్ శాశ్వత నివాసి అవుతాడని 35-ఎ నిబంధన స్పష్టం చేస్తోంది. శాశ్వత నివాసి అయిన వ్యక్తి మాత్రమే కశ్మీర్‌లో స్థిరాస్తుల్ని కలిగి ఉండవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా సహాయాలు ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఆర్టికల్ 35-ఎ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చొచ్చు. దీర్ఘకాలం రాష్ట్రంలో నివసిస్తున్న వారికి ధ్రువపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయొచ్చు. కశ్మీరేతరుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాకూడదని 1956 నవంబర్ 17న ఆమోదించిన నిబంధనను జమ్ముకశ్మీర్ రాజ్యాంగం స్పష్టం చేస్తోంది.