మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్..ఈ పేరు వినగానే ముంబయి భీకర పేలుళ్ల దృశ్యాలు కళ్లముందు కనిపిస్తాయి. 12ఏళ్ల క్రితం దేశ ఆర్థిక రాజధానిలో మారణహోమం సృష్టించి ఎంతో మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కరుడుగట్టిన ఉగ్రవాది అతడు. పక్కా పాకిస్థానీ అయిన కసబ్‌ను హిందూ ఉగ్రవాదిగా చూపించేందుకు ఒకదశలో ప్రయత్నాలు జరిగాయట. కసబ్ చేతికున్న 'ఎర్రదారాన్ని' ఇందుకు కారణంగా చూపించారట. ఈ మేరకు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ రాకేశ్ మరియా.. 'లెట్ మీ సే ఇట్ నౌ' పేరుతో రాసిన తన పుస్తకంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
హిందూ ఉగ్రవాదంగా చూపే యత్నం
ముంబయి పేలుళ్ల తర్వాత కసబ్ ఫొటో ఒకటి బయటకొచ్చింది. అందులో భుజాన బ్యాగ్ వేసుకుని తుపాకీ పట్టుకుని వెళ్తున్న కసబ్ తన కుడిచేతికి ఎర్రదారం కట్టుకుని కన్పిస్తాడు. ఈ ఫొటో ద్వారా ముంబయి పేలుళ్లను 'హిందూ ఉగ్రవాదం' వల్ల జరిగిన ఘటనగా చూపించే ప్రయత్నం చేసింది లష్కరే తోయిబా సంస్థ. అంతేగాక కసబ్ గుర్తింపు కార్డులోనూ అతడి పేరు సమీర్ దినేశ్ చౌధరీ అని, బెంగళూరు వాసి అని ఉంది. దాడి చేసింది హిందువులే అన్నట్లు చూపించే ప్రయత్నమది.
'ఈ ఎర్రదారం చూపించి దాడిని హిందూ ఉగ్రవాద ఘటనగా చూపించాలని లష్కరే భావించింది. అలా చేస్తే మీడియా కూడా దానిపై దృష్టి పెడుతుందని అనుకుంది. పెద్ద పెద్ద టీవీ జర్నలిస్టులు సైతం సమీర్ దినేశ్ చౌధరీ కోసం బెంగళూరు వెళ్తారని ఊహించింది. అయితే అవేమీ పనిచేయలేదు. అజ్మల్ కసబ్ పాకిస్థాన్ వాసి అని తెలిసిపోయింది' అని మరియా తన పుస్తకంలో పేర్కొన్నారు.