తెలంగాణ

telangana

కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా సాకారమైందిలా!

By

Published : Nov 9, 2019, 5:21 AM IST

సిక్కుల చిరకాల స్వప్నం నెరవేరుస్తూ కర్తార్‌పుర్‌ కారిడార్‌ నేడు ప్రారంభం కానుంది. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య వారధిగా ఉండబోయే ఈ నడవా ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కర్తార్‌పుర్‌ మందిరం ప్రత్యేకత ఏమిటి, అది పాక్‌లో ఎందుకు ఉంది, ఆ నడవా నిర్మాణం విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా సాకారమైందిలా!

సిక్కుల చిరకాల స్వప్నం నేడు నెరవేరనుంది. పాకిస్థాన్​ భూభాగంలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని యాత్రికులు చేరుకునేందుకు వీలుగా ఆధ్యాత్మిక నడవాను భారత్-పాకిస్థాన్ సంయుక్తంగా నిర్మించాయి. గురునానక్ జయంతికి సరిగ్గా మూడో రోజుల ముందు ఈ నడవా ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్తార్​పుర్​ పుణ్యక్షేత్ర విశేషాలు.

గురునానక్ చివరి 18 ఏళ్లు

పాకిస్థాన్‌ కర్తార్‌పుర్‌లో రావి నది ఒడ్డున ఉన్న గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఎందుకంటే 1469లో జన్మించిన సిక్కుమత స్థాపకుడైన గురునానక్‌ దేవ్‌ తన జీవితంలో చివరి 18 సంవత్సరాలు ఇక్కడే గడిపారని మత గ్రంథాల ద్వారా తెలుస్తోంది. 1539లో గురునానక్‌ ఇక్కడే పరమపదించారు.

దేశ విభజనలో..

1947లో భారత్‌ను రెండుగా విభజించినపుడు ఈ ప్రాంతం పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లిపోయింది. దీనివల్ల భారత్‌లోని సిక్కులు తమ పవిత్ర క్షేత్రంగా భావించే ఈ మందిరం దర్శనం కోసం పాక్‌కు వెళ్లడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ జిల్లా సరిహద్దు నుంచి పాక్‌లోని ఈ మందిరం కనిపిస్తుంది.

నాలుగు కిలోమీటర్ల దూరంలోనే..

ఇది అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అక్కడికి వెళ్లాలంటే లాహోర్‌కు వెళ్లి అక్కడ నుంచి తిరిగి కర్తార్‌పుర్‌కు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ దర్శనానికి కారిడార్‌ నిర్మించాలని సిక్కులు అనేక సంవత్సరాలుగా కోరుతున్నారు. ఈ కారిడార్‌ పాక్‌లోని దర్బార్‌ సాహిబ్‌ ఆలయం నుంచి పంజాబ్‌లోని డేరాబాబా నానక్‌ మందిరాన్ని కలుపుతుంది.

ప్రప్రథమంగా వాజ్​పేయీ..

1999లో అప్పటి భారత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ.. లాహోర్‌ సందర్శనకు వెళ్లినపుడు ఈ నడవా నిర్మాణాన్ని ప్రతిపాదించారు. కానీ అది అప్పుడు అమలుకు నోచుకోలేదు.

మోదీ ప్రభుత్వం చొరవతో..

2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం చివరి దశలో దీనికి అనూహ్యంగా పచ్చజెండా ఊపి వారి కలకు బాటలు పరిచింది.

సిద్ధూ కౌగిలితో వెలుగులోకి..

గతేడాది పంజాబ్‌ మంత్రి నవజోత్‌సింగ్‌ సిద్దూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ప్రమాణస్వీకారానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన పాక్‌ ఆర్మీ చీఫ్‌ జావెద్ బజ్వాను హత్తుకున్నారు. దీనిపై భారత్‌లో పెద్ద వివాదం రాజుకుంది. సిద్దూ దానికి వివరణ ఇస్తూ పాకిస్థాన్‌ కర్తార్‌పుర్‌ కారిడార్‌ నిర్మాణానికి మద్దతిచ్చినట్లు ఆయన చెప్పారని అందుకే సంతోషంతో కౌగిలించుకున్నానని చెప్పడం వల్ల కారిడార్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

దశాబ్దాల కలకు గతేడాదే పునాది..

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఈ నడవాకు గత సంవత్సరం నవంబర్‌ 22న అంగీకారం తెలిపింది. గురునానక్‌ జయంతికి సిక్కులకు ఈ నడవాను కానుకగా ఇవ్వాలని కోరుతూ పాక్‌ను కోరగా దాయాది దేశం సానుకూలంగా స్పందించింది. అంతేకాకుండా నిర్మాణం దిశగా పనులు వేగవంతం చేసి శంకుస్థాపన చేశారు. అలా రెండు దేశాల మధ్య సంయుక్తంగా ప్రారంభమైన ఆ ప్రాజెక్టు ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. దీని నిర్మాణంతో దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న సిక్కుల కల నెరవేరబోతోంది.

ఇదీ చూడండి: స్వచ్ఛంద పదవీ విరమణకు 3 రోజుల్లో 40 వేల మంది!

ABOUT THE AUTHOR

...view details