సిక్కు మత వ్యవస్థాపకులు గురునానక్.. తన చివరి 18 ఏళ్లను గడిపిన కర్తార్‌పుర్‌ను దర్శించుకోవాలన్న భారతీయ భక్తుల అడ్డుంకులు నేటితో తొలగిపోనున్నాయి. పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం నరోవాల్ జిల్లాలో ఉన్న దర్బార్ సాహిబ్‌ను.. భారత్‌లోని పంజాబ్ గురుదాస్‌పుర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ ఆలయాన్ని కలిపే కర్తార్‌పుర్ ఆధ్యాత్మిక నడవా నేడు ప్రారంభం కానుంది.
క్రీ.శ.1522 సంవత్సరంలో కర్తార్‌పుర్ వద్ద సాహిబ్ గురుద్వారాను నెలకొల్పారు గురునానక్ దేవ్. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకోవడానికి భారత్‌లోని సిక్కు మతస్థులు దశాబ్దాలుగా ఎదురుచూశారు. చివరికి వారి నిరీక్షణ ఫలించి.. నడవా నిర్మాణానికి భారత్-పాకిస్థాన్‌లు అంగీకారం తెలిపాయి. అక్టోబర్ 24న కారిడార్ నిర్వహణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ నడవా.. భక్తులకు వీసా రహిత ప్రయాణాన్ని కల్పిస్తుంది. ఈ మేరకు భారత్ వైపు నడవాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ... పాక్ వైపు కారిడార్‌ను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించనున్నారు.
ముఖ్యనేతలతో మొదటి బృందం..
కర్తార్‌పుర్ ను దర్శించుకునేందుకు 550 మందితో కూడిన భారత ప్రతినిధి బృందం జాబితాను కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కు పంపింది. ఈ జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కేంద్రమంత్రులు హర్‌దీప్ సింగ్ పురి, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌తో పాటు కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, దీపేందర్ సింగ్ హుడా, జితిన్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
సన్నాహాలు పూర్తి...
కారిడార్ ప్రారంభోత్సవానికి ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గురుదాస్‌పుర్, కపుర్తలా, అమృత్‌సర్ జిల్లాలకు సెలవు ప్రకటించారు. సందర్శకుల భద్రతకు పాక్ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 100 మందితో కూడిన పర్యటక పోలీసు దళాన్ని మోహరించింది. ఈ సంఖ్యను మరింత పెంచుతామని వెల్లడించింది పాక్ పోలీసు విభాగం. కర్తార్‌పుర్‌లో గురుద్వారా మినహా మరే ప్రాంతానికి వెళ్లకూడదని పాక్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.