'ప్రకృతి మనిషికి మాత్రమే సొంతమా? కోటానుకోట్ల జీవరాశులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవించే మానవుడు.. తనకు తాను భూమిని శాసిస్తాననుకోవడం సరైనదేనా? పాపం పక్షులు ఏం చేశాయని.. స్వేచ్ఛగా ఎగురుతూ విహరించాల్సినవి ఆకలి దప్పికలతో విలవిల్లాడుతూ మనిషి స్వార్థానికి, కరెంటు తీగలకు వేలాడాల్సిందేనా?' అచ్చం ఇలాంటి ప్రశ్నలే కర్ణాటకకు చెందిన ఓ రైతుకు తలెత్తాయి. అందుకే, తనవంతుగా పక్షుల కోసం మూడెకరాల్లో జొన్న పంట వేసేశాడు. 'బర్డ్ మ్యాన్'గా పేరు తెచ్చుకున్నాడు.
వేళ దేవనగరె జిల్లా, శ్యామనూర్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కొంకాలా.. లాక్డౌన్లో పశుపక్షాదుల ఆకలి కేకల వార్త చదివాడు. వెంటనే.. దాదాపు 40శాతం ఆదాయం పక్షుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాదు పక్షులు, చిన్న చిన్న జంతువుల కడుపు నింపేందుకు తన మూడెకరాల పొలంలో.. జొన్న పంట వేశాడు.
"లాక్డౌన్ వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ బయట జంతువులు, పక్షులు ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రకృతి సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. మనతోపాటే జీవరాశులన్నీ బతకాలి. మనం చెట్లు పెంచితే పక్షులు, జంతువులు వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటాయి. అందుకే నా మూడెకరాల పొలంలో జొన్న పండించి వేలాది పక్షుల ఆకలి తీర్చుతున్నా."