భారత్‌లో మహమ్మారి కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలు, థియేటర్లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పలు రాష్ట్రాలు భారీగా నిధులను విడుదల చేస్తున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కరోనాపై పోరాటానికి రూ.200 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు.
టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
రాష్ట్రంలో ఈనెల 14 నుంచి విధించిన ఆంక్షలను 31వ తేదీవరకు పొడిగించింది ప్రభుత్వం. అంతేకాకుండా కొందరు మంత్రులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కార్యదళం ప్రతిరోజూ సమావేశమై వైరస్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు నివేదికలను సమీక్షిస్తుంది.
"మహమ్మారి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నాం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ పరీక్షించి 15-16 రోజులు నిర్బంధంలో ఉంచుతాం. శాసనసభ, సచివాలయంలోకి ప్రజలను అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. బహిరంగ కార్యక్రమాలు, పెద్ద ఎత్తున ఉత్సవాలు, వివాహాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించకుండా ఆంక్షలు విధిస్తాం. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ, స్వైన్‌ఫ్లూ తదితర వ్యాధులు కూడా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం."