కర్ణాటక రాష్ట్ర కాలుష్య నివారణ బోర్డు 'పసుపు గణేశా' ప్రచారం చేపట్టింది. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి పర్యావరణహిత విఘ్నేశ్వరుడే తోడ్పడుతాడంటూ అవగాహన కల్పిస్తోంది.
పసుపులో బోలెడన్ని ఔషధ గుణాలుంటాయి. కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే పసుపు మన సంప్రదాయంలో భాగం కావడం అదృష్టమే. అంతేనా..? పసుపు ముద్దతో తయారుచేసిన గణేశుడికి పూజలు చేసి.. ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. దీంతో నదులు చెరువుల్లో కాలుష్యం వాటిల్లదు. విగ్రహం పూర్తిగా కరిగిపోయాక ఆ నీటిని ఇంట్లో నలుమూలలా చల్లితే ఇంటిని శానిటైజ్ చేసినట్టే అంటోంది బోర్డు.
"బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) ఈ ఏడాది బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఉంచడం, పూజా కార్యక్రమాలను నిర్వహించడం రద్దు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బీబీఎంపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో, వినాయక చవితి వేడుకలు జరుపుకోలేమేమో అని ప్రజలు నిరుత్సాహపడిపోయారు. కానీ, ఆ చింత అక్కర్లేకుండా ఎవరింట్లో వారే ఆరోగ్యకరమైన పద్ధతిలో పసుపు వినాయకుడిని పూజించుకోవచ్చు. "