కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగి, యెడియూరప్ప సారథ్యంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరాక ఒక కొలిక్కి వచ్చాయి. ప్రభుత్వాలు మారినంతనే మొత్తం కథ ముగిసిందని చెప్పలేని పరిస్థితి ఉంది. తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసిన 17 మందిపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయగా రాజ్యాంగపరమైన సంక్లిష్టతలు తలెత్తాయి.
కాంగ్రెస్, జేడీఎస్‌లతో తెగతెంపులు చేసుకొని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తమ నిర్ణయాన్ని ఆమోదించాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. వారిలో పదిమంది సభ్యులు నేరుగా ఆయనను కలిసి రాజీనామాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష నిర్వహించినప్పుడు సభ్యులు గైర్హాజరు అయ్యారు కాబట్టి వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని కాంగ్రెస్, జేడీఎస్‌లు గట్టిగా పట్టుబట్టాయి.
స్పీకర్ సంచలన నిర్ణయం
ఈ రెండు పార్టీల ఫిర్యాదుల మేరకు ప్రస్తుత శాసనసభ కాలపరిమితి పూర్తయ్యేవరకూ రాజీనామా చేసిన సభ్యులెవరూ తిరిగి పోటీ చేయకుండా నిషేధం విధిస్తూ స్పీకర్ నిర్ణయించడం సంచలనం సృష్టించింది. ఫలితంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేల ఆశలు అడియాశలయ్యాయి. భాజపా తరఫున వారికి టికెట్లు కట్టబెట్టి ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలన్న యెడియూరప్ప ఆలోచనలూ భగ్నమయ్యాయి!
మొత్తం వ్యవహారం ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. మరోవంక తమపై అనర్హత వేటును సవాలు చేస్తూ సభ్యులందరూ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ‘సుప్రీం’ తీర్పు ఎలా ఉండబోతుందన్న అంచనాలు పక్కనపెడితే రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తూట్లు పొడిచాయనడంలో సందేహం లేదు.
రాజీనామాలతో రాజుకున్న వివాదం
కాంగ్రెస్, జనతాదళ్(ఎస్)లకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి వెళ్ళి తమ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించగా రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకొంది. తాను కార్యాలయంలో లేని సమయంలో సభ్యులు రాజీనామా పత్రాలు ఇచ్చి వెళ్ళారు కాబట్టి వాటిపై నిర్ణయం తీసుకోలేనని ఆయన తేల్చిచెప్పారు. ఎవరి ఒత్తిడికో తలొగ్గి రాజీనామాలు ఇచ్చారా లేక స్వచ్ఛందంగా సమర్పించారా అన్న విషయం తేటపడాలంటే సభ్యులను నేరుగా కలవాల్సి ఉందని శాసన సభాపతి వ్యాఖ్యానించారు.
నిబంధనల ప్రకారం శాసన సభ్యులెవరైనా ప్రత్యక్షంగా స్పీకర్‌ను కలిసి ‘స్వచ్ఛందంగా, ఎలాంటి ఒత్తిళ్లకూ లోనుకాకుండా నిజాయతీగా రాజీనామా చేస్తున్నామని వెల్లడించిన పక్షంలో (అందుకు స్పీకర్ సంతృప్తి చెందితే) ‘వెనువెంటనే’ సభాపతి ఆ రాజీనామాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు నేరుగా సమర్పించకపోతే, నిబంధనలమేరకు సభాపతి విచారణ సాగించవచ్చు. ఆ సభ్యులు స్వచ్ఛందంగా, నిజాయతీగా తమ పదవులకు రాజీనామా చేశారా లేదా అన్న విషయాన్ని లోతుగా విచారించి నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది. ఒకవేళ సభ్యుల సమాధానాలతో ఆయన సంతృప్తి చెందకపోతే ఆ రాజీనామా పత్రాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించవచ్చు.
విప్ బ్రహ్మాస్త్రం
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పదిమంది శాసనసభ్యులు స్పీకర్‌ను నేరుగా కలిసి తమ రాజీనామాలకు కారణాలు వివరించారు. అనంతరం అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా పాలక సంకీర్ణానికి చెందిన కాంగ్రెస్, జనతాదళ్(ఎస్)లు తమ సభ్యులందరూ తప్పనిసరిగా సభకు హాజరై విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటు వేయాలని ‘విప్’ జారీ చేశాయి. రాజీనామా చేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆ ‘విప్’ను పట్టించుకోకుండా ముంబయిలోనే ఉండిపోయారు.
ఒకదానివెంట ఒకటిగా చోటుచేసుకున్న ఆ పరిణామాలను, అసెంబ్లీ నిబంధనలను విశ్లేషిస్తే తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించి ఉండాల్సింది అనిపిస్తోంది. సభలో విశ్వాస పరీక్ష నిర్వహణకు చాలా రోజుల ముందే వారు రాజీనామా చేశారు. విశ్వాస పరీక్ష సందర్భంగా ఆయా పార్టీలు జారీ చేసిన ‘విప్’లు తమకు వర్తించవని తిరుగుబాటు ఎమ్మెల్యేలు భావించారు.
కూటమి ప్రయత్నాలు
తమ పార్టీ గూళ్లనుంచి ఎగిరిపోయిన ఆ సభ్యులను తిరిగి దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్)లు పక్షం రోజులపాటు రకరకాల ప్రయత్నాలు చేశాయి. అక్రమంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను తరలించి ముంబయిలో దాచారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదులూ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నాయకుడు డీకే శివకుమార్ ముంబయిలో శాసనసభ్యులు ఉన్న హోటల్‌లోకి వెళ్ళేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. హోటల్‌ను సందర్శిస్తున్న కర్ణాటక నాయకుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆ ఎమ్మెల్యేలు ముంబయి పోలీసులను అభ్యర్థించారు. హోటల్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు శివకుమార్‌ను నిలువరించారు.
వెంకయ్య తీరు ఇలా..
సభ్యుల రాజీనామాలపై రాజ్యసభ ఛైర్మన్‌గా ఇటీవల వెంకయ్యనాయుడు వ్యవహరించిన తీరుకూ, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా రమేశ్ కుమార్ వ్యవహార సరళీకి మధ్య అంతరం కనిపిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నీరజ్ కుమార్ అనే రాజ్యసభ సభ్యుడు ఈ నెల 15న సభాపతికి రాజీనామా పత్రం సమర్పించారు. వెంటనే ఆ సభ్యుడిని సభాపతి తన వద్దకు పిలిపించుకున్నారు. స్వచ్ఛందంగా, పూర్తి నిబద్ధతతో ఆ సభ్యుడు రాజీనామా చేశారా, ఆయన తన నిర్ణయంపై పునరాలోచిస్తారా అన్న విషయాలను అడిగి కనుక్కున్నారు. సభ్యుడి సమాధానాలతో సభాపతి సంతృప్తి చెందారు. ఆ మరుసటి రోజే నీరజ్ కుమార్ రాజీనామాను ఆమోదించినట్లు వెల్లడించారు. రాజీనామాపై సభ్యుడు పట్టుబట్టినప్పుడు వెంటనే దానిని ఆమోదించి, సంబంధిత లాంఛనాలు పూర్తి చేయాలని కార్యాలయ అధికారులను వెంకయ్య నాయుడు ఆదేశించారు.
నాటి పరిణామాలు నేడు పునరావృతం
పార్టీ సభ్యుల గోడ దూకుళ్లను 91వ రాజ్యాంగ సవరణ దాదాపు అసాధ్యంగా మార్చేసింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి రావడానికి సంఖ్యాపరంగా తక్కువపడితే అవతలి పక్షం ఎమ్మెల్యేలను ఆకర్షించి, వారితో పదవులకు రాజీనామా చేయించి- వారికి తమ పార్టీ తరఫున టికెట్లు ఇచ్చి ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడమే పాలక పక్షాలకు మార్గాంతరంగా మారింది.
2008లో అధికారంలోకి వచ్చేందుకు కొన్ని స్థానాలు తగ్గినప్పుడు యెడియూరప్ప చేసింది ఇదే. ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు కాబట్టి మొత్తంగా సభను రద్దు చేసి, మరోసారి ఎన్నికలకు వెళ్ళడం కన్నా కొందరు సభ్యులు బయటపడి మరో పార్టీ టికెట్‌పై తిరిగి పోటీ చేసి, ప్రజామోదం కోరడమే సహేతుకమైనదన్నది నా అభిప్రాయం. కర్ణాటకలో 2008 నాటి పరిణామాలే ఇప్పుడూ పునరావృతమయ్యాయి. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ ఆదేశించిన నేపథ్యంలో ‘న్యాయ నిర్ణయం’పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో ఏదో ఒకటి తేలేవరకూ కర్‘నాటకం’ కొనసాగుతూనే ఉంటుంది!
ఇదీ చూడండి: కర్ణాటక కొత్త స్పీకర్‌గా కాగేరీ బాధ్యతలు