'కర్ణాటక సర్కార్' సంక్షోభం కొలిక్కివచ్చేనా? కర్ణాటకలో కాంగ్రెస్ -జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మంత్రి పదవుల కేటాయింపులు, లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులపై అసంతృప్తిగా ఉన్న 13 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాతో తలెత్తిన సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు.
ముఖ్యనేతల చర్చలు
అమెరికా పర్యటనలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదివారం బెంగళూరు చేరుకున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ నేతలు బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్లో ఆదివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో కుమారస్వామి, జేడీఎస్ సీనియర్ నేత హెచ్డీ దేవేగౌడ, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.
కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు
ముంబయిలోని ఓ హోటల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒకరిని బెంగళూరు రావాలని పార్టీ కోరింది. రాజీనామా చేసిన సీనియర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే.
ఎమ్మెల్యేల రాజీనామా వెనుక భాజపా హస్తముందని ఆరోపించారు. మరోవైపు జేడీఎస్ అధినేత దేవేగౌడతో చర్చలు జరిపారు కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డీకే శివకుమార్. బెంగళూరులోని ఆయన నివాసానికి వెళ్లిన శివకుమార్ తాజా సంక్షోభం నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన అంశాలపై సమాలోచనలు జరిపారు.
సీఎంగా ఖర్గే పేరు తెరపైకి..
శివకుమార్‌తో భేటీ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య వైఖరిని దేవేగౌడ తప్పుబట్టారు. సంక్షోభ నివారణ కోసం సీఎంగా ఖర్గేను ఎంపిక చేస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఖర్గేకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. అయితే తాను ముఖ్యమంత్రి రేసులో లేనని మల్లికార్జున ఖర్గే అంటున్నారు.
సిద్దరామయ్య నేతృత్వంలో భేటీ
సీఎల్పీ నేత సిద్ధరామయ్య నేతృత్వంలో మంగళవారం జరిగే శాసనసభా పక్ష సమావేశానికి ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ సర్క్యులర్ జారీ చేసింది. సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో ముఖ్యులకు మంత్రి పదవులు ఇచ్చేందుకు సంకీర్ణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఇప్పటికీ తమతో సంప్రదింపుల్లో ఉన్నారని సిద్ధరామయ్య అంటున్నారు.
స్పీకర్ నిర్ణయంపైనే కూటమి భవితవ్యం
కాంగ్రెస్ -జేడీఎస్ ప్రభుత్వ మనుగడ స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. రాజీనామాలపై స్పీకర్ రమేష్ కుమార్ తన నిర్ణయాన్ని మంగళవారం వెల్లడించే అవకాశం ఉంది. ప్రభుత్వ భవిష్యత్తు ఆ రోజే తేలనుంది. ఈనెల 12న కర్ణాటక శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా...ఆ లోపే కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. రాజీనామాల అంశాన్ని స్పీకర్.. గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో తాజా పరిణామాలను ఆయన కూడా గమనిస్తున్నారు.
భాజపా సిద్ధం
కర్ణాటకలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది కమలం పార్టీ. అవకాశమిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమేనని కర్ణాటక భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాల వెనక తమ హస్తం ఉందంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండించారు.
విమానం భాజపా ఎంపీది..
అసమ్మతి ఎమ్మెల్యేలు బెంగళూరు నుంచి ముంబయి వెళ్లిన ప్రత్యేక విమానం.. జుపిటర్ కేపిటల్ ప్రెవేట్ లిమిటెడ్‌కు చెందింది. ఈ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ భాజపా రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి జనతాదళ్నేతలతో కలిసి భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
విమాన అవసరం ఎవరికున్నా ఉపయోగించుకోవచ్చని జుపిటల్ కేపిటల్ సంస్థ వివరణ ఇచ్చింది.
ఇదీ చూడండి: రాహుల్ అనుచర బృందం భవిష్యత్తుపై సందిగ్ధం