ఓ అత్యాచారం కేసులో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం జరిగిన తర్వాత బాధితురాలు అలసిపోయి నిద్రపోయాయని చెప్పటం అర్థరహితమని అన్నారు. ఈ కేసులో నిందితుని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారిస్తూ ఈ విధంగా స్పందించారు జస్టిస్ కృష్ణ దీక్షిత్.
"ఘటన జరిగిన తర్వాత కక్షిదారు అలసిపోయి పడుకున్నానని చెప్పారు. ఇది అర్ధరహితం. భారతీయ మహిళలు ఇలా వ్యవహరించరు. తమకు తీరని అన్యాయం జరిగినప్పుడు ఈ విధంగా స్పందించరు."
- జస్టిస్ కృష్ణ దీక్షిత్
పెళ్లి పేరుతో దగ్గరై...
ఈ ఏడాది మే నెలలో తన దగ్గర పనిచేస్తున్న నిందితుడిపై అత్యాచారం కేసు పెట్టింది బాధితురాలు. అతనిపై సెక్షన్ 376 (లైంగిక హింస), 420 (మోసం), 506 (బెదిరింపు) కేసులు నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. బాధితురాలి వద్ద రెండేళ్లుగా నిందితుడు పనిచేస్తున్నాడు. అత్యాచారం జరిగిన రోజు ఆమెతో పాటు నిందితుడు కారులో కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే ఘటన జరిగింది. పెళ్లి పేరుతో బాధితురాలితో శారీరకంగా దగ్గరైనట్లు ఆరోపణలు ఉన్నాయి.