కర్ణాటక రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. రేపు బలపరీక్షకు ముందు రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. రాజీనామాలపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోమని స్పీకర్‌ను ఒత్తిడి చేయలేమని సుప్రీం స్పష్టం చేసింది. అయితే బలపరీక్షకు రావాల్సిందిగా ఎమ్మెల్యేలను ఎవరూ బలవంతం చేయరాదని సూచించింది. కాంగ్రెస్,జేడీఎస్ ఇప్పటికే జారీ చేసిన మూడు లైన్ల విప్ చెల్లదని తేల్చిచెప్పింది.
'బలపరీక్షకు హాజరుపై తుది నిర్ణయం ఎమ్మెల్యేలదే' - బలవంతం
శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసిన 15 మంది కూటమి ఎమ్మెల్యేల వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రాజీనామాలు ఆమోదించాలన్న అభ్యర్థనపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోయినా.... బలపరీక్షకు ముందు రెబల్స్‌కు ఉపకరించేలా కీలక ఆదేశాలిచ్చింది. గురువారం బలపరీక్షకు హాజరుకావాలా లేదా అనే అంశంపై రెబల్ ఎమ్మెల్యేలదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
విశ్వాస పరీక్షకు హాజరుకావాలో వద్దో ఎమ్మెల్యేల ఇష్టమని స్పష్టంచేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజీనామాలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది.
"న్యాయస్థానం రెండు ఆదేశాలు జారీ చేసింది. ఒకటి... ఎమ్మెల్యేలు బలపరీక్షకు హాజరుకావాలని ఎవరూ వారిని ఒత్తిడి చేయకూడదు. 15 మంది ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనిచ్చింది. వారు అసెంబ్లీకి వెళ్లడం, వెళ్లకపోవడం వారి ఇష్టం. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేరాదు. కనుక వారిపై విధించిన విప్.. సుప్రీం తీర్పుతో ఇక చెల్లదు.
రెండవది.. రాజీనామాలపై స్పీకర్ తాను నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకునేలా ఆదేశమిచ్చింది."
- ముకుల్ రోహత్గి, రెబల్ ఎమ్మెల్యేల న్యాయవాది
- ఇదీ చూడండి: కర్టాటక సంక్షోభం మధ్య భాజపా కచేరీ..!